GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు గాను మొత్తం 17 మంది నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఎంఐఎం పార్టీ నుంచి 8 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు వేయగా, పరిశీలనలో అన్ని ఓకే అయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్లో భాగంగా ఈ నెల 21 (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసంహరణ అవకాశం ఉండటంతో గురువారం బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన ప్రసన్న లక్ష్మి , చివరి రోజు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు కమిషనర్ ఇలంబర్తి ప్రకటించారు.
స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వీరి పదవీకాలం ఒక ఏడాది పాటు ఉంటుంది. జీహెచ్ఎంసీలో రూ. రెండు కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర విలువైన పనులకు స్టాండింగ్ కమిటీ వారానికోసారి సమావేశం అవుతుంది. అందుకు వారంలో ఏదో ఒక రోజును ఎంపిక చేసుకోవడం అనవాయితి. గత పాలక మండలిలో ప్రతి గురువారం నిర్వహిస్తూ వచ్చారు.
ఎంఐఎం నుంచి గౌస్ ఉద్దీన్ మహ్మద్, డాక్టర్ ఆయేషా హుమేర, సమీనా బేగం, పర్వీన్ సుల్తానా, మహ్మద్ సలీం, అబ్ధుల్ వాహెద్, సయ్యద్ మినహాజుద్దీన్, బాత జబీన్ లు, కాంగ్రెస్ నుంచి మహాలక్ష్మి రామన్ గౌడ్, బురుగడ్డ పుష్ప, సీఎన్ రెడ్డి, వి. జగదీశ్వర్ గౌడ్, బానోతు సుజాత, బొంతు శ్రీదేవి, బాబా ఫసియుద్దీన్ లు ఉన్నారు.
వారిది ఒక్కటే ఎజెండా. అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీతో మంట కాగడం పతంగి పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో బీఆర్ఎస్తో జత కట్టిన ఎంఐఎం పార్టీ ఈ సారి కాంగ్రెస్కు అండగా నిలబడింది. పరస్పర అవగాహన ఒప్పందంలో భాగంగానే ఎంఐఎం పార్టీ స్టాండింగ్ కమిటీలో 8 మందితో నామినేషన్లు వేసి తమ ఆధిక్యతను ప్రదర్శించుకున్నది. బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో కలిసి 7 సభ్యులతో స్టాండింగ్ కమిటీలో చోటు కల్పించుకున్నది. ఎన్నికల ఏడాది కావడంతో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వ విధానపరమైన లోపాలను ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేసేలా కార్యాచరణను రూపొందించుకున్నది. కాగా, స్టాండింగ్ కమిటీలో రెండు పార్టీలకు సంబంధించి ఒక్కో పార్టీ నుంచి నలుగురు మహిళా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉండటం గమనార్హం.