GHMC | సిటీబ్యూరో: గ్రేటర్లో ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ప్రతి జోన్లో టాప్ 100 బకాయిదారుల జాబితాను సిద్ధం చేసుకొని నోటీసులకు స్పందించని సంబంధిత యజమానులకు సంబంధించి మొత్తం ఐదు చోట్ల ప్రాపర్టీలను స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 70 ప్రాపర్టీలను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా స్పెషల్ డ్రైవ్‌తో బకాయిదారులు ముందుకు వచ్చి చెల్లింపులు జరుపుతున్నారు. శుక్రవారం ఒక్క రోజూ 4వేల మంది నుంచి రూ.20 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడం గమనార్హం. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రూ.2100కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ.1520కోట్ల మేర పన్ను వసూళ్లు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలకు నోటీసులు
ఆస్తిపన్ను రూపంలో మొండి బకాయిలు మొత్తం దాదాపుగా రూ. 9800కోట్ల మేర రావాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలదే కీలకం. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన 600 ప్రాపర్టీల నుంచి రూ. 500 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 4వేల ప్రాపర్టీల నుంచి రూ. 5000 కోట్ల బకాయిలు జీహెచ్ఎంసీ ఖజానాను చేరాల్సి ఉంది. అయితే ప్రజల విషయంలో ప్రాపర్టీల సీజ్ వరకు వెళ్తున్న అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బకాయిల రాబడిలో మాత్రం తూతూ మంత్రంగా నోటీసులతో సరిపెడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.