హైదరాబాద్: ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరిస్తున్నది. మొండి బకాయిలు చెల్లించని ఆస్తులను సీజ్ చేస్తున్నది. తాజాగా నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు షాకిచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తాజ్ బంజారా (Taj Banjara) హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. రెండేండ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ గేట్లకు తాళాలు వేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పంచకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రూ.1.43 కోట్ల పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. పన్ను చెల్లించాలని రెడ్ నోటీసు ఇచ్చామని, అయినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం చర్యలు చేపట్టామని చెప్పారు.
కాగా, జీహెచ్ఎంసీకి రూ.9,800 కోట్లు మొండి బకాయిలు రావాల్సి ఉన్నది. ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా రూ.2,200 కోట్ల పన్ను వసూలును జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో 23 లక్షల నిర్మాణాల్లో పన్ను చెల్లిస్తున్నవారు 12 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఆస్తి పన్ను చెల్లింపులో ఐదు లక్షల నిర్మాణాలు అలసత్వం వహిస్తున్నాయి. గత ఆర్థిక ఏడాదిలో లక్షా 8 వేల ఆస్తులకు సంబంధించి అధికారులు రూ.320 కోట్లు వసూళు చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్నులను మార్చి 29 వరకు వసూళ్లు చేయాల్సిందేనని జీహెచ్ఎసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆస్త పన్ను చెల్లింపుల కోసం మరోసారి ఓటీఎస్ అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.