GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ) : ఆస్తి పన్ను వసూళ్లలో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు దాదాపు రూ.1416 కోట్ల మేర మాత్రమే చేరుకున్నారు. 12 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లించగా.. మరో ఐదు లక్షల మంది ఇంకా చెల్లించాల్సి ఉంది. వీరి నుంచి దాదాపు రూ.684 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉంది. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఆస్తిపన్ను వసూళ్లను పెంచాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు బకాయిదారులకు ఓటీఎస్ (వన్‌టైం సెటిల్మెంట్) అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ అందిస్తూ వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీంను అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్దమైంది. ఈ మేరకు ప్రతిపాదన కమిషనర్ ఇలంబర్తి పరిశీలనలో ఉంది.
గ్రేటర్లో ప్రస్తుతం ఆస్తిపన్ను బకాయిలు రూ.5వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆఫీసులకు సంబందించిన పన్నులు రూ. 3వేల కోట్లు ఉండగా, రూ. 2 వేల కోట్లు ఆస్తిపన్ను దారుల నుంచి రావాల్సి ఉంది ఓటీఎస్‌ను ఆమలు చేస్తే ఓటీఎస్ రూపంలో రూ. 500కోట్ల మేర ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అధికారికంగా ఓటీఎస్ ఆమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదే జరిగితే 10శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తిపన్నును చెల్లించే వెసులుబాటు దొరుకుతుంది. ఓటీఎస్‌తో దాదాపు 2 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కాగా జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు మూడు సార్లు వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌ను ఆమలు చేశారు. మొదటి సారి 2020 ఆగస్టు 1 నుంచి నవంబరు 15 వరకు, 2022 జులైలో రెండోసారి అమలు చేశారు. మూడు సార్లు కలిపి జీహెచ్ఎంసీకి దాదాపు రూ.700 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరోసారి అమలు చేస్తే రూ. 500కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.