Amberpet | అంబర్‌పేట, ఏప్రిల్ 21: వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రిపూట నరకం అనుభవిస్తున్నారు. రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట డివిజన్ రామకృష్ణ నగర్లో ఈ దుస్థితి నెలకొంది.
రామకృష్ణ నగర్లో గత వారం, పది రోజులుగా ఈ కాలనీలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదు. కాలనీ మొత్తం చీకట్లు అలముకుంటున్నాయి. ద్విచక్ర వాహనదారులు గుంతలుగా ఉన్న రోడ్లపై వీధి లైట్లు వెలగకపోవడంతో కిందపడి గాయాలపాలవుతున్నారు. కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. దీంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వీధి దీపాలకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.