GHMC | మన్సురాబాద్, మే 27: వర్షాకాలంలో ఎలాంటి వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్ సర్కిల్ 3, 4, 5 కు చెందిన కార్పొరేటర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ కి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ సర్కిళ్ల పరిధికి చెందిన అధికారులు ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లను సమన్వయ పరుచుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, కొవిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రీమాన్సూన్ క్లీనప్ పేరుతో నగర పరిశుభ్రత కోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 24 బృందాలను ఏర్పాటు చేశామని ప్రతి టీమ్‌లో 14 మంది వర్క్ చేస్తారని చెప్పారు. ఈ టీంలలో ప్రతి డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు, సిబ్బంది ఉంటారని అన్నారు. సంబంధిత అధికారులు ప్రతి బస్తీ, గల్లీలలో తిరుగుతూ శానిటేషన్, గార్బేజ్ తదితర సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు.
శానిటేషన్ సిబ్బంది కొరత వల్ల కాలనీలలో పరిశుభ్రత పనులు చేపట్టడం ఇబ్బందిగా మారిందని కార్పొరేటర్లు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను పెంచే విషయాన్ని త్వరలో సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. సరూర్‌నగర్ చెరువులో మురుగునీటి కలయిక వలన సమస్యలు తలెత్తుతున్నాయని దీనివలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నట్లు కార్పొరేటర్లు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. సరూర్‌నగర్ చెరువు వద్ద ఎస్టీపీ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఇంట్లోని చెత్తాచెదారంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న భవనాల వ్యర్థ శిథిలాలు, పాత భవనాలకు చెందిన శిథిలాలను ఇష్టానుసారంగా రోడ్లపై వేస్తే జరిమానాలు వేస్తామని హెచ్చరించారు. చెత్త వ్యర్థాలను వేసేందుకుగాను నగరంలోని పలు ప్రాంతాలలో రాంకీ సంస్థ సహకారంతో సుమారు 750 డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మ్యాన్ హోళ్ళు, నాలాలలో చెత్తా చెదారం వేయడాన్ని ప్రజలు మానుకోవాలని సూచించారు. చెత్తాచెదారం వేయడం వలన వర్షాకాలంలో మ్యాన్ హోళ్ళు, నాళాలు పొంగి కాలనీలలో వరద ముంపు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. నగర పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంటిని ఎలా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు. సమీక్షా సమావేశం సందర్భంగా కార్పొరేటర్లు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలం రానున్న తరుణంలో త్వరితగతిన ఎస్ ఎన్ డి పి పనులను పూర్తి చేయాలని మేయర్ ను కోరారు.