GHMC | సిటీబ్యూరో, జనవరి 15(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీకి ఆదాయ వనరుల్లో అడ్వర్టయిజ్మెంట్ (ప్రకటన విభాగం) ప్రత్యేకం. ఏటా రూ.80 కోట్ల పైన రావాల్సిన చోట.. కేవలం రూ. 20 కోట్లు దాటడం లేదు. ఏజెన్సీల కొమ్ముకాస్తూ కొందరు అధికారులు బల్దియా ఖజానాకు గండి కొడుతున్నారు. ముఖ్యంగా కేబీఆర్ పార్కు కేంద్రంగా ప్రకటన దందా జరుగుతున్నదని ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు పర్యవేక్షించడం లేదు. కేబీఆర్ పార్కు చుట్టూ, ప్రధాన రహదారి సెంట్రల్ మీడియన్‌లో అత్యధికంగా లాలీపాప్స్ (ప్రకటనల బోర్డులు) దర్శనమిస్తాయి. రికార్డుల కంటే అత్యధికంగా అనధికారికంగా ఉంటాయన్నది ప్రధాన ఆరోపణ.
ముఖ్యంగా కొంత మేరలో కోర్టు స్టే ఆర్డర్ పేరుతో న్యాయస్థానంలో గెలిచి సదరు జీహెచ్ఎంసీ ఆదాయాన్ని మెరుగుపర్చే చోట ప్రకటనల విభాగంలోని కొందరు అధికారులు నెలకు రూ.5 లక్షల మేర ముడుపులు సదరు ఏజెన్సీ నుంచి అందుతున్నాయని బలంగా వినిపిస్తున్న విమర్శ. దీనికి తోడు నగరంలో ఎక్కడైనా 15 మీటర్ల కంటే ఎత్తు ఉన్న హోర్డింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. 15 మీటర్ల వరకు ఉన్న హోర్డింగ్‌లు సైతం పక్కాగా నిబంధనల ప్రకారం నడపాలి. సదరు ఏజెన్సీలు మెట్రో పిల్లర్ల లక్ష్యంగా అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలుస్తున్నది. నగరంలో 1500 చోట్ల ట్రాఫిక్ అంబ్రెల్లాలు ఉంటే 3వేల వరకు ఉన్నాయని, వీటిని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్లో ఎన్ని అనుమతులున్నాయో..?
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్ని హోర్డింగులకు అనుమతులున్నాయో, వాటికి ఎంత గడువుందో తెలియదు. అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులెన్నో.. వాటి ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. యూనిపోల్స్, లాలీపాప్స్, హోర్డింగు ఇలా అనేక ఉన్న ప్రాంతాలు అధికారుల రికార్డులు లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి ఎక్కడ పొంతన ఉండటం లేదన్నది ఇటీవల వస్తున్న బలమైన ఆరోపణలు. ఈ క్రమంలోనే ప్రకటన విభాగంలో భారీగా అవినీతి జరుగుతున్నదని, జీహెచ్ఎంసీకి రావాల్సిన అడ్వర్టయిజ్మెంట్ ట్యాక్స్ కోట్లాది రూపాయలను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని, అక్రమ హోర్డింగ్స్లు, మాల్స్‌లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసిన వారు ‘కార్తీక్’ ట్యాక్స్ చెల్లిస్తున్నారని గతంలో జరిగిన కౌన్సిల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ దృష్టికి కార్పొరేటర్లు తీసుకువచ్చారు. ప్రకటనల రూపంలో వందల కోట్లు రావాల్సిన చోట కేవలం రూ.20 కోట్లు మాత్రమే వస్తుండటం పట్ల కార్పొరేటర్లు తీవ్రంగా తప్పుపట్టారు.
కనిపించని క్షేత్రస్థాయి తనిఖీలు
గ్రేటర్లో ఎన్ని కేటగిరీల నుంచి జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుందనేది స్పష్టత లేదు. సెంట్రల్ డివైడర్లు, యూనిపోల్స్, హోర్డింగ్స్, నియో గ్లోసైన్ బోర్డులు, బస్ షెల్టర్లు, వాల్ పెయింటింగ్, ఫ్లెక్సీ బోర్డు, గ్లాస్ పోస్టర్, పిల్లర్ బోర్డులు, పెయింటింగ్, స్టిక్కర్, ప్లాగ్స్, షాప్షూట్ బెలూన్లు, అంబ్రెల్లాస్, ైస్లెడ్, షార్ట్ ఫిల్మ్, ఆటోలు, బస్సులు, క్యాబ్స్, వ్యాన్స్లకు సంబంధించిన ప్రకటనలపై ఫీజు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పెట్రోల్ బంకుల్లో భారీ స్థాయిలో గ్లోసైన్ బోర్డులు ఏర్పాటు చేసుకుని ప్రకటనలు ఇస్తున్నారు. వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.