GHMC | సిటీబ్యూరో: ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ఆపసోపాలు పడుతున్నది. మరో 17 రోజుల్లో ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్నది. 12.70 లక్షల మంది నుంచి రూ. 1,570 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. మరో రూ.430 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ట్యాక్స్ కలెక్షన్స్‌కు సంబంధించిన అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేశారు.
వన్‌పాయింట్ ప్రోగ్రాం..
హోలీ, రంజాన్, ఉగాది పండుగలు తదితర అన్నిలరకాల సెలవులు రద్దు చేసుకుని ఆస్తిపన్ను వసూళ్లపై ఫోకస్ పెట్టేలా దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరు వరకు ఇతర పనుల జోలికి వెళ్లకుండా ఆస్తిపన్ను వసూళ్లపై వన్ పాయింట్ ప్రోగ్రాం కింద తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. అంతకు ముందు జోన్ల వారీగా ఐదు లక్షలు బకాయిదారుల జాబితాను రూపొందించి వారిపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. అయితేఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో ఈ నెల 7న ఆస్తిపన్ను బకాయిదారులకు ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఓటీఎస్ ద్వారా రోజుకు ఆస్తిపన్నులో వేగం పెరుగుతుందని భావించారు. కానీ ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకునేందుకు పెద్దగా బకాయిదారులు ముందుకు రావడం లేదు. ఈ మేరకు ఓటీఎస్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, కనీసం రూ. 300కోట్లు ఓటీఎస్ వసూళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డీసీలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బకాయిలపై దృష్టి సారించి సంబంధిత శాఖలను నోటీసులు ఇవ్వనున్నారు. మొత్తంగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఆస్తిపన్ను కలెక్షన్లు టార్గెట్‌గా అధికారులు పనిచేయనున్నారు.