OTS | సిటీబ్యూరో: ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ఎట్టకేలకు వన్ టైం సెటిల్మెంట్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఓటీఎస్ కింద ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ కల్పించాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన మేరకు అనుమతి ఇస్తూ శుక్రవారం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా సర్కిల్ వారీగా విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. కాగా, ఆస్తిపన్ను నిర్దేశిత వసూళ్లలో జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా..ఇప్పటి వరకు దాదాపు రూ.1540కోట్ల మేర మాత్రమే చేరుకున్నారు. 12.60 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లించగా…దాదాపు మరో 5 లక్షల మంది ఇంకా చెల్లించాల్సి ఉంటుంది. వీరి నుంచి దాదాపు రూ.560 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉంది. ఈ నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఆస్తిపన్ను వసూళ్లను పెంచాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు బకాయిదారులకు ఓటీఎస్ (వన్‌టైం సెటిల్మెంట్) అవకాశం కల్పించాలని కోరడం…వెంటనే అధికారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఓటీఎస్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.