HomeHyderabadGhmc Has Taken Steps To Expand The Services Of Ward Offices
సేవ మరింత చేరువ
వార్డు కార్యాలయాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది. వార్డు కార్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మ్యాపులను గూగుల్‌లో అప్లోడ్ చేశారు.
వార్డు ఆఫీస్ సేవలు.. రేపటితో నెల రోజులు
ఇప్పటివరకు 48 వేల ఫిర్యాదుల పరిష్కారం
పౌరుల నుంచి విశేష ఆదరణ
గూగుల్‌లో వార్డు సమాచారం
సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): వార్డు కార్యాలయాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది. వార్డు కార్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మ్యాపులను గూగుల్‌లో అప్లోడ్ చేశారు. క్లిక్ చేయగానే ఆయా స్థానిక వార్డు కార్యాలయానికి సులువుగా పౌరుడు చేరేలా చర్యలు చేపట్టారు. పౌరులు అందించిన ఫిర్యాదులకు పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా గత నెల 16వ తేదీన గ్రేటర్ హైదరాబాద్‌లో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రేపటితో వార్డు కార్యాలయాలు ప్రారంభించి నెల రోజులు కావడం.. శుక్రవారం వరకు 48వేల ఫిర్యాదులను అధికారులను స్వీకరించి పరిష్కారం చూపారు. ఎక్కువ శాతం వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, ఎంటమాలజీ, వీధి కుక్కల బెడద లాంటివి ఎక్కువగా వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని, ఈ సేవలను పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన దరిమిలా వార్డు కార్యాలయ వ్యవస్థలో ఫిర్యాదు వచ్చిన తర్వాత వేగంగా సమస్యలను పరిషారం చూపేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వార్డు కార్యాలయాల సేవలపై ఆకస్మిక తనిఖీలకు సిద్ధమయ్యారు.
రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో..
వార్డు పరిధిలో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గూగుల్ మ్యాప్ ద్వారా..
తాజాగా ఆయా సర్కిళ్ల పరిధిలో వార్డు కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి? వార్డు ఆఫీస్‌లకు ఎలా వెళ్లాలి? సమగ్ర గూగుల్ మ్యాప్ ద్వారా సులువుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. వార్డు కార్యాలయాలకు అవసరమైన టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువచేసే కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.