సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ చనిపోయాడని, అతడి మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్‌ను సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు, కౌన్సిల్లో పట్టుబట్టారు. రాజకీయ కక్షతోనే బాబా ఫసియుద్దీన్ అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆత్మహత్య బాధాకరమని, పోలీసులు కేసు నమోదు చేశారని, బాబా ఫసియుద్దీన్ పాత్ర ఉందా? లేదా అనే విషయం విచారణలో వెలుగు చూస్తుందని మేయర్ చెప్పగా, బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
ఎక్స్‌ఆఫిషియో సభ్యుడిగా వచ్చిన ఎంపీ రఘునందన్ రావు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకానొక దశలో అధికార పార్టీ కార్పొరేటర్‌ను సపోర్టు చేస్తూ మాట్లాడిన తీరు బీజేపీ కార్పొరేటర్లు సైతం ఆశ్చర్యపోవడం గమనార్హం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మా ఎంపీ సపోర్టు చేశారని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సభలోనే చెప్పడం గమనార్హం. నాలా పూడితీతత పనులపై పార్టీలకు అతీతంగా అధికారుల పనితీరులో లోపాలను తూర్పారా పట్టారు. మేయర్ సైతం ఒకానొక దశలో సీఈ మెయింటనెన్స్ సహదేవ్ రత్నాకర్‌పై మండిపడ్డారు. పూడికతీత, నాలా అభివృద్ధి పనుల్లో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలని మేయర్ ఆదేశించారు.
అధికారుల సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేయగా..మేయర్ జోక్యం చేసుకుని వచ్చే వారం నుంచి జోనల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, అన్ని అంశాలను అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మేయర్ తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగంలో అవినీతి తాండవిస్తుందని, సంస్థకు వచ్చే ఆదాయం పక్కదారి పడుతుందని సభ్యులు ఆధారాలతో సహా ప్రస్తావించారు. ప్రకటనల రూపంలో ఏటా రూ. 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే చోట అధికారులు సంస్థ ఖజానాకు గండికొడుతున్నారని బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు.
అడ్డదారిలో వచ్చిన నవ నిర్మాణ్ అసోసియేట్‌కు కేబీఆర్ పార్కు మల్టీ లెవల్ కారు పార్కింగ్ టెండర్‌ను అప్పజెప్పారని ఆరోపించారు. గోపన్‌పల్లి ఫ్లై ఓవర్, గగన్ పహాడ్‌లో రెండు హోర్డింగ్‌లు, ట్రాఫిక్ అంబెరిల్లాలో అక్రమాలు జరిగాయన్నారు. స్పందించిన అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ 624 ట్రాఫిక్ అంబెరిల్లాలో 100 వరకు జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారని, 30 అక్రమంగా ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించామని చెప్పారు. బుధవారం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో 11వ సాధారణ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. పహల్గాం, గుల్జార్ హౌస్ ఘటనల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
బస్తీవాసులు ఇళ్ల నిర్మాణానికి పడుతున్న ఇబ్బందులపై అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు సభలో ప్రస్తావించారు. నోటరీ స్థలాలకు అనుమతులు ఇవ్వలేమని వివరణ జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉన్న స్థలాలకు నిర్మాణ అనుమతిని మంజూరు చేయగలమని సీసీపీ శ్రీనివాస్ చెప్పారు. దీంతో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే మేయర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అనుమతి ఇచ్చే అధికారం లేనప్పుడు..పేదల ఇళ్లను కూల్చే అధికారం కూడా మీకు లేదని మేయర్ అనడం తీవ్ర చర్చకు దారి తీసింది.
కౌన్సిల్ సమావేశం అసంతృప్తిగా జరిగింది. ప్రజా సమస్యలపై సరైన స్పందన ఇవ్వలేదు. మాన్సూన్ విషయంలో చర్చించాలని అడిగిన మైక్ ఇవ్వలేదు. పదే పదే గత ప్రభుత్వం గుర్తించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టారో సమాధానం చెప్పాలి. నాలాలలో పూడికతీత తీయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
– సామల హేమ, బీఆర్ఎస్ కార్పొరేటర్
మేము కొట్టినట్లు చేస్తాం…మీరు ఏడ్చినట్లు చేయండి అన్నట్లుగా సభ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని మరోమారు తేలిపోయింది బాబా ఫసియుద్దీన్‌ను సస్పెండ్ చేయాలని కోరుదామంటే కనీస సమయం ఇవ్వలేదు. చర్చించే అవకాశం కల్పించలేదు.
– ఆవుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్
కౌన్సిల్ సమావేశంలో జపాన్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమావేశం పూర్తయ్యే వరకు వారు సభ తీరును పరిశీలించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, శానిటేషన్, బర్త్ అండ్ డెత్, వీధి లైట్లు, ప్రకటనలు డీ-సిల్టింగ్ తదితర అంశాలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయా విభాగాల అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు విజయశాంతి, బల్మూరి వెంకట్, మిర్జా రియాజ్ ఉల్ హస్సన్, మిర్జా రహమత్ బేగ్, అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు జుల్ఫికర్ అలీ, మాజీద్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కమిషనర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, వేణుగోపాల్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను బలి చేస్తున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. రోహింగ్యాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన విదేశాల ముస్లింలు అని వ్యాఖ్యానించడంపై ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాధ్యక్షత వహించిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి చెప్పారు.
‘21001 జనన, 1906 మరణ ధ్రువీకరణ పత్రాలు రద్దు చేశాం. 16 మంది ఆపరేటర్లు, 15 మంది హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాం. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. అక్రమాలు జరగకుండా సంస్కరణలు అమలు చేస్తున్నాం’ అని అదనపు కమిషనర్ పంకజ తెలిపారు. కాగా, నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో బాధ్యతగా ఉండాల్సిన అదనపు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి కునుకు తీయడం గమనార్హం.
బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ నేత సర్థార్ మృతికి కారణమైన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ముందు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నోటరీపై భవన నిర్మాణం చేసిన సర్దార్‌పై బాబా ఫసియుద్దీన్ వేధింపులకు పాల్పడ్డారని, టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయించి మరీ నిర్మాణాన్ని కూల్చివేయించారని, అంతటితో ఆగకుండా పార్టీ మారాలంటూ వేధింపులకు పాల్పడి సర్దార్ చావుకు కారణం అయ్యాడని బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య ఆరోపించారు.
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న బాబా ఫసియుద్దీన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సర్దార్ మృతికి కారణమైన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ వెంకటేశ్ డిమాండ్ చేశారు. చనిపోయిన సర్దార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనకు జడిసిన బాబా ఫసియుద్దీన్ కౌన్సిల్ హాల్లోకి రాకుండా మేయర్ చాంబర్లో కూర్చోవడం, నిరసన కార్యక్రమం తగ్గిన తర్వాత కౌన్సిల్ హాల్లోకి రావడం గమనార్హం.