సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేసి విధులు నిర్వహించాల్సిన విజిలెన్స్ విభాగంలోని కొందరు అధికారులు హైడ్రాలో పనిచేస్తుండటంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు, అంతర్గత విచారణల నివేదిక రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉన్నప్పటికీ బాధ్యతలు మరిచి హైడ్రాలో కొంతకాలంగా పోలీసు శాఖ నుంచి వచ్చిన డిప్యుటేషన్ అధికారులు పనిచేస్తున్నారు .
ఈ విషయాన్ని రెండురోజుల కిందట ‘నమస్తే’లో విజిలెన్స్ ఉనికి ప్రశ్నార్థకం’..శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు కమిషనర్ ఆమ్రపాలి విజిలెన్స్ అధికారులపై సీరియస్‌గా స్పందించారు. గురువారం బల్దియాలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. జీహెచ్ఎంసీలో పనిచేయాల్సిన కొందరు విజిలెన్స్ విభాగపు అధికారులు హైడ్రాలో పనిచేస్తున్నట్లు అదనపు కమిషనర్ నళినీ పద్మావతి కమిషనర్‌కు వివరించారు.
అంతేకాకుండా హైడ్రాలో పనిచేస్తున్న వారందరినీ రిలీవ్ చేసి.. జీహెచ్ఎంసీకి వెనక్కు పంపాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అదనపు కమిషనర్ లేఖ రాసినట్లు కూడా కమిషనర్‌కు తెలిపారు. ఈ పరిణామాలపై కమిషనర్ ఆమ్రపాలి విజిలెన్స్ విభాగం అధికారుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైడ్రాలో పనిచేస్తున్న బల్దియా విజిలెన్స్ అధికారులకు ఈనెల జీతాలు నిలిపివేయాలంటూ బల్దియా ఫైనాన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.