సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వరద ముంపు నివారణకు నాలా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం కూకట్పల్లి జోన్‌లోని వరద ముంపు ప్రాంతాలైన మైసమ్మ చెరువు, ఐడీఎల్ చెరువు, సఫ్దర్ నగర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. ఇక ముందు వరద ముంపునకు గురి కాకుండా నాలా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
ముంపునకు గురైన కాలనీ వాసులకు రక్షిత తాగునీరు సరఫరా చేయాలని, దోమల నివారణకు ఏఎల్ఓ, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఐడీఎల్, మైసమ్మ చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కమిషనర్ వెంట కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, ఎస్ఈ చిన్నారెడ్డి, డీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ్లోటింగ్ మెటీరియల్‌ను తొలగించాలి..
గ్రేటర్లో వర్షం లేనప్పుడు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ కల్వర్టుల వద్ద ఫ్లోటింగ్ మెటీరియల్‌ను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం అదనపు, జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. క్షేత్ర స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షం కురిసిన సమయంలో ఫ్లోటింగ్ మెటీరియల్ కల్వర్టుల వద్ద నిలిచి.. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జోనల్ కమిషనర్లు చొరవ తీసుకోవాలన్నారు.
నాలా క్లీనింగ్ చర్యలు ఫొటోలతో సహా పంపించాలని కమిషనర్ సూచించారు. వరద ముంపునకు గురైన కాలనీల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని హెల్త్ అదనపు కమిషనర్‌ను ఆదేశించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల జిల్లా వైద్య అధికారులను సంప్రదించి వారి పరిధిలోని కాలనీల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, ఎకువ దెబ్బతిన్న రోడ్లు, పాట్ హోల్స్ వద్ద ప్రమాదాలు జరుగకుండా హెచ్చరిక బోర్డులు, అటుగా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు.