Ganja | హైదరాబాద్ : గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎవరూ ఊహించని విధంగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఓ ఇద్దరు యువకులు తమ శరీరమంతా గంజాయిని చుట్టుకుని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఒడిశా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ బస్సులో ఇద్దరు యువకులు గంజాయి అక్రమంగా రవాణా చేశారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది. అయితే ఆ ఇద్దరి వద్ద బ్యాగుల్లో గంజాయి దొరకలేదు. తెలివిగా తమ శరీరానికి గంజాయిని చుట్టుకుని, ఆపై బట్టలు వేసుకున్నారు. పోలీసులు వారిని పసిగట్టి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిద్దరి బట్టలిప్పి చూడగా గంజాయి బయటపడింది.
గంజాయిని తరలించిన వారిని శివ బిశ్వాస్, రాహుల్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్స్‌ను సీజ్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.