Hyderabad | హిమాయత్ నగర్, జూలై 11 : గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారిని సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటిఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూరకు చెందిన చెన్న రమేష్ గౌడ్(27) వృత్తి రీత్యా వడ్డీల వ్యాపారo చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో నాలుగు భవనాలు ఉండగా లక్షల్లో వడ్డీల వ్యాపారం చేస్తున్నాడు. సంపాదనపై మరింత ఆశ పెంచుకుని గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడు.
ఒరిస్సా నుంచి గంజాయిని తెప్పిస్తూ గుట్టు చప్పుడు కాకుండా నగరంలో అవసరమున్న వ్యక్తులకు తన బైకుపై తీసుకువెళ్లి ఇస్తూ డబ్బులు సంపాదించుకు టున్నాడు. మల్లాపూర్ నుంచి కోఠి వైపు గంజాయిని బైక్‌పై తీసుకెళ్తున్నట్లు సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు నారాయణగూడలోని వైఎంసిఏ వద్ద అతని వాహనంను ఆపి తనఖీ చేయగా 4.5 కేజీల గంజాయి లభించింది. గంజాయితో పాటు రూ.20 వేల నగదు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడు రమేష్ గౌడ్‌ను నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీలో సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ సావిత్రి సౌజన్య, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఖలీం, కానిస్టేబుళ్లు రాజు, రవి, శిల్ప, సునీత, రమేశ్‌లు పాల్గొన్నారు.