Crime News | వెంగళరావునగర్, ఆగస్టు 30: ఆటోలో ప్రయాణికుల్లా వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఒకే తరహాలో మూడు వరుస చోరీలు చేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్ సంతోష్గిరికి చెందిన వాల్ పెయింటర్ అజయ్ శుక్రవారం ఉదయం బ్రహ్మశంకర్‌నగర్ నుంచి యూసుఫ్‌గూడకు వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్నాడు. ఇంతలో వచ్చిన ఆటోలో చూడగా.. వెనుక సీట్లో అప్పటికే ముగ్గురు కూర్చొని ఉన్నారు.
డ్రైవర్ పక్కన కూర్చోబోగా.. అతడు వెనుక సీట్లో కూర్చోవాలని సూచించాడు. యూసుఫ్‌గూడ వరకు ప్రయాణించిన అతడు ఆటో దిగి చూసుకోగా.. జేబులోని సెల్‌ఫోన్ కనిపించలేదు. ప్రయాణికుల మాదిరిగా ఉన్న ఆ ముగ్గురిలో ఒకరు తన సెల్‌ఫోన్ కొట్టేశాడంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా.. రహ్మత్‌నగర్‌కు చెందిన సాయికిరణ్ సెల్‌ఫోన్‌ను కూడా నేరగాళ్లు కొట్టేశారు. మూడో ఘటనలో.. ప్రైవేట్ ఉద్యోగి శ్యామ్ కూడా ఇదే మార్గంలో ఆటోలో వెళ్లగా.. నేరగాళ్లు ఫోన్ కొట్టేశారు. ఒకే తరహాలో మూడు నేరాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.