మెహిదీపట్నం : మే 4: జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాలను, దొంగల నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వారిని మెహిదీపట్నం, నార్సింగ్, కొల్లూరు, శంషాబాద్ పోలీసులతో కలిసి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.
టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం… టోలిచౌకి ప్రాంతంలో నివసించే అహ్మద్ నవీద్( 22), ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. హకీంపేట్‌కు చెందిన మహ్మద్ సోహెల్ (19) ప్లంబర్‌గా, షేక్ మోహిత్ అలీ(20), గోల్కొండ మోతీ దర్వాజలో నివసించే మహ్మద్ మిరాజ్(19), ఆసిఫ్ నగర్ జిర్రాలో నివసించే షేక్ సమద్ (23), బహదూర్‌పురా మిశ్రీ గంజ్‌లో నివసించే షేక్ నసీర్ (26), ఆటో రిక్షాలలో తిరుగుతూ ద్విచక్ర వాహనాలను దొంగిస్తూ వాటిని అమ్ముకుంటూ జల్సాలు చేసుకుంటున్నారు.
వీరి వద్ద నుంచి ముషీరాబాద్ బోలక్ పూర్ కు చెందిన మహ్మద్ బాసిత్ అలీ (19), బోయిన్పల్లి హస్మాత్ పేట్ కు చెందిన మహ్మద్ సమీర్ (20), మరో ముగ్గురు దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేశారు. నార్సింగి, మెహిదీపట్నం,కొల్లూరు, శంషాబాద్ పోలీస్ స్టేషన్ల ప్రాంతాలలో దొంగిలించిన ద్విచక్ర వాహనాలను , వాహనాలను దొంగలించడానికి వాడిన ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఓ బాలుడు పరారీలో ఉన్నాడు. ఆరుగురు దొంగలతో పాటు, వారి వద్ద వాహనాలను కొన్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.