నగరంలోని పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
బంజారాహిల్స్, డిసెంబర్ 26: అర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూరారం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎర్రా ఈశ్వర్రావు(42) అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌లోని నాని టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంటాడు. శుక్రవారం ఉదయం పనికోసం వెంకటగిరి వైపునుంచి జూబ్లీహిల్స్‌కు వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈశ్వర్రావు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు రాణిగంజ్ డిపోకు చెందినదని గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్ రాంబాబును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 26: ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చిన బైకిస్టు ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్ మునీరాబాద్ ప్రాంతానికి చెందిన నూనావత్ హరిచంద్(30) దేవరాంజల్లోని రిలయన్స్ రిటైల్ కంపెనీలో సెక్యురిటీగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పనులు ముగించుకొని మునీరాబాద్‌లోని తన ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలోని దేవరాయంజల్‌లోని జంబో టైల్స్ కంపెనీ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరిచంద్ అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మన్సూరాబాద్, డిసెంబర్ 26: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, అజయ్‌నగర్ కాలనీకి చెందిన యాటల దుర్గాప్రసాద్ (29) వృత్తిరీత్య ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. ఉప్పల్, చిలుకానగర్‌లో నివాసముండే దుర్గాప్రసాద్ సోదరుడు యాటల శివకార్తీక్ తన సోదరుడి ఇంటికి వచ్చేందుకు బస్సులో నాగోల్ చౌరస్తాకు వచ్చాడు. నాగోల్ చౌరస్తాలో వేచి చూస్తున్న సోదరుడిని తీసుకొచ్చేందుకు గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి దుర్గాప్రసాద్ బయలుదేరాడు. నాగోల్, సుజాత హోటల్ వద్దకు రాగానే స్కూటిపై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి దుర్గాప్రసాద్ బైకును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో కింద పడిపోయిన దుర్గాప్రసాద్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడి సోదరుడు శివకార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ రూరల్, డిసెంబర్ 26 : ఔటర్‌రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహళ మృతి చెందగా మరో నాలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులకు గాయాలైన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన కొత్తగాడి శిరీష(31) ఆమె కుతూరు సృజన(10)తోపాటు బంధువులు సంధ్య(36), వీరమణి(45), శారద(40) సంధ్య కూతురు అభిజ్ఞ(9)లు కలిసి వారి స్వగ్రామం నుంచి రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఉన్న ఓ మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లడం కోసం కారులో బయలుదేరి వస్తుండగా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్త్తూ ఔటర్‌రింగ్ రోడ్డు డివైడర్‌ను ఢీకొవడంతో కారులో ఉన్న శిరీష (31) అక్కడిక్కడే మృతి చెందింది. మిగిత వారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయలైన వారిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. మృతి చెందిన శిరీషను పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.