ఆదిబట్ల, జూలై 18: రంగారెడ్డి జిల్లా బొంగ్లూర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓఆర్ఆర్పై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. పెద్ద అంబర్‌పేట నుంచి బొంగ్లూర్ వైపు వెళ్తుండగా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకున్నది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని అతికష్టంపై బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని తెలిపారు. వీరంత యాదగిరి గుట్టకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారని, అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధితులు మొయినాబాద్‌లోని గ్రీన్ వాలీ రిసార్ట్‌లో పనిచేస్తున్నారని వెల్లడించారు. మృతులను వరంగల్ జిల్లాకు చెందిన మాలోత్ చందు లాల్(29), గుగులోతు జనార్దన్ (50), కృష్ణ (40), మొయినాబాద్‌కు చెందిన కావలి బాలరాజు (40)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి బీఎన్‌రెడ్డి నగర్‌లోని నీలాద్రి దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.