కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 10 : రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో 100 పడకల ఏరియా వైద్యశాల భూమిపూజా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావుతో కలిసి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించిందన్నారు. పేద ప్రజలకు వైద్యం, విద్య, మౌలిక వసతులు కల్పించే దిశగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా జిల్లాకు ఓ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేశామని, నగరంలో పేద ప్రజల కోసం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన, పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. నీతిగా నిజాయితీగా పనిచేయడం వల్లే ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని మంత్రి తెలిపారు.
వైద్యశాలతో ప్రజలకు ఎంతోమేలు..
కూకట్‌పల్లిలో 100 పడకల వైద్యశాల ఏర్పాటు కావడం వల్ల పేద ప్రజలకు ఎంతోమేలు జరుగుతుందని మంత్రి అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి వైద్యశాలను తీసుకొచ్చారన్నారు. వైద్యశాల నిర్మాణం కోసం రూ.31 కోట్లను కేటాయించామని.. తొమ్మిది నెలల్లో వైద్యశాల నిర్మాణ పనులు పూర్తవుతాయని 89 మంది సిబ్బంది, 35 మంది డాక్టర్లతో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, ఆరోగ్య సమస్యలన్నింటికీ వైద్యశాలలో సేవలు లభిస్తాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో చెరువులు, పార్కులు, ఇండోర్ స్టేడియాలు అభివృద్ధి చేశామని, రైతుబజార్‌ను మోడల్ రైతుబజార్‌గా తీర్చిదిద్దామని తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ వెంచర్-2లో ఫైనల్ కాస్ట్ సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
కూకట్‌పల్లిలో తాగునీటి సమస్యలు తీరాయని.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలిస్తున్న మహారాష్ట్రలో నేటికీ తొమ్మిది రోజులైనా తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. నిజాన్ని ప్రచారం చేయకపోతే అబద్దం రాజ్యమేలుతుందని.. తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట : ఎమ్మెల్యే మాధవరం
కూకట్పల్లి ప్రజలకు ఆరోగ్య సౌభాగ్యాన్ని కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో తాగునీరు, మౌలిక వసతులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతో పాటు అడిగిన వెంటనే వైద్యశాలను మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీషాబాబురావు, జూపల్లి సత్యనారాయణ, సజీహాబేగం, రవీందర్‌రెడ్డి, సతీశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బాబురావు, శ్రవణ్‌కుమార్, నరేంద్రాచార్య, నియోజకవర్గ కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ రాజేందర్‌కుమార్, ఎస్ఈ సురేందర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈ రవీందర్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి రాజేశ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.