హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం పేర్లు, ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అన్నారు.
అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్‌లో ఇమిడి ఉన్నాయి. లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉంది. సికింద్రాబాద్‌ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. లష్కర్ సాధన సమితి తరఫున రెండేళ్లుగా అడుగుతున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అందరూ కలిసి రావాలి. అన్ని రాజకీయ పార్టీలు కచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.
రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి MG రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు తరలి రావాలి అని పిలుపునిచ్చారు.