వెంగళరావునగర్, అక్టోబర్ 22: ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావడంతో పాటు బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బుధవారం సోమాజిగూడ క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో శ్రీనగర్‌కాలనీలోని తన నివాసంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సబితారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచాలని.. కార్యకర్తలు కర్తవ్య నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలనను ఈనెల 24వ తేదీకి ముందుగా పూర్తిచేసి తుది జాబితాను క్లస్టర్ ఇన్‌చార్జ్‌లకు సమర్పించాలని పేర్కొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్దిని ఓటర్లకు వివరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.