వెంగళరావునగర్, నవంబర్ 4 : కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజాగ్రహం పెల్లుబుకుతుందని మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిగూడలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ఇంటింటికీ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వెళ్లిన చోటల్లా ప్రజల నుంచి నిరసన సెగ తగులుతుందని పేర్కొన్నారు. ప్రజాగ్రహంలో కాంగ్రెస్ మసైపోతుందని హెచ్చరించారు.
బోగస్ హామీలతో ప్రజల్ని వంచించి అధికారంలోకి వచ్చాక విస్మరించిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని కోరారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్కు ప్రజాదరణ మెండుగా ఉందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.