Hyderabad | అమీర్‌పేట, ఆగస్టు 11: అమీర్‌పేట్ డివిజన్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. సీఎం అంతటి వ్యక్తి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తున్నారంటే.. ఆయన వెంట అధికారులు కచ్చితంగా ఉంటారు. ఆ సమయంలో సీఎం పర్యటిస్తున్న ప్రాంతానికి సంబంధించి వాస్తవ సమస్యలను, ఆ సమయంలో ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఉంటే.. కచ్చితంగా సీఎం స్థాయిలో అక్కడికక్కడే తీసుకునే నిర్ణయాలు.. ముంపు ప్రాంతాల రూపురేఖలు మార్చేయగలవు. అంతటి ప్రయోజనం ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన వల్ల ఇక్కడి బస్తీలకు దక్కకుండా పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సీఎం తన పర్యటనలో భాగంగా గాయత్రీనగర్, బుద్ధనగర్, గంగుబాయి బస్తీల్లో పర్యటించారు. సీఎం పర్యటన ఉండబోతోందన్న కనీస సమాచారం స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఉండి ఉంటే, ఇక్కడి వాస్తవ పరిస్థితులు సీఎం దృష్టికి తీసుకువెళ్లడంలో ఆయన సమర్థవంతంగా వ్యవహరించే వారని అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి పేర్కొన్నారు.
వాస్తవానికి బుద్ధనగర్ నాలా ఆక్రమణ వంటి లోతైన అంశాలు సీఎం దృష్టికి వెళ్లనేలేదని, గాయత్రీనగర్‌లో గత ప్రభుత్వం కోట్లాది నిధులు వెచ్చించి ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ కింద చేపట్టిన వరదనీటి కాలువ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఉంటే.. సమస్య పరిష్కారమయ్యేదని ఆమె అన్నారు. సీఎం పర్యటన గురించి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు సమాచారం లేకపోవడంలో రాజకీయాంశాలు ఏమీ లేకపోయినా, స్థానిక ఎమ్మెల్యే ఇటువంటి పర్యటనల్లో ఉంటే, ఇక్కడి బస్తీలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరేదని ఆమె అన్నారు.
గతంలో కేసీఆర్ పర్యటనను దారి మళ్లించి…
సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులు నియోజకవర్గ పర్యటనలకు వచ్చే ముఖ్యమంత్రి వద్ద సమస్యలను ప్రస్తావిస్తే.. అవి ఎంతటి ప్రయోజనాలకు దారి తీసుకుందనే విషయాన్ని మాజీ కార్పొరేటర్ ఎన్. శేషుకుమారి ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీడీపీలో కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలో డబుల్ బెడ్రూం నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచనతో ఉన్న సీఎం కేసీఆర్.. ఒక సందర్భంలో బేగంపేట డివిజన్లో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు.
ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్లో శిథిలావస్థకు చేరిన ఐడీహెచ్ కాలనీ గృహ సముదాయాలను ఒక్కసారి పర్యటించాల్సిందిగా కోరారు. ఇందుకు సమ్మతించిన అప్సటి సీఎం కేసీఆర్.. వెంటనే ఐడీహెచ్‌కాలనీలో శిథిలావస్థలో ఉన్న గృహ సముదాయాలను సందర్శించారని, వెంటనే ఇక్కడి గృహ సముదాయాలను కూల్చి వేసి, డబుల్ బెడ్రూం నిర్మాణాల పథకాన్ని ఇక్కడే నుంచే ప్రారంభించాలని నిర్ణయించిన విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. సీఎం పర్యటనలకు అంతటి ప్రాముఖ్యత ఉంటుందని ఆమె వివరించారు.