సిటీబ్యూరో: నగరంపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. మంగళవారం తెల్లవారు జాము నుంచి రెండు గంటలకు పైగా కురిసిన జోరు వర్షానికి గ్రేటర్ అతలాకుతలమైంది. రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. కాగా అత్యధికంగా ఖైరతాబాద్‌లో 12.5 సెంటీమీటర్లు, ఉప్పల్‌లో 12.1, రాజేంద్రనగర్‌లో 11.9, సరూర్‌నగర్‌లో 11.5, మారేడ్‌పల్లిలో 11.1, బహదూర్‌పురలో 10.8, గోల్కొండలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సాయంత్రం వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చగా.. అత్యధికంగా పటాన్చెరులో 4.4 సెంటీమీటర్లు, అమీర్‌పేటలో 3.0, ఖైరతాబాద్‌లో 2.3, బాలానగర్‌లో 2.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
గ్రేటర్లో 6 సెంటీ మీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది.163 ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎల్బీ స్టేడియం పాత సీసీఎస్ వైపున ప్రహరీ కూలింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. 41 చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడగా, 30 చోట్ల డీఆర్ఎఫ్ బృందాలు క్లియర్ చేశాయి.
కుండపోత వర్షానికి బేగంపేట బ్రాహ్మణవాడి మయూరి మార్గ్‌లో వాహనదారులు, హయత్‌నగర్ హైకోర్టు కాలనీలో వరద ముంపుతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆజంపుర ఆర్యూబీ వద్ద నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫర్హత్ నగర్ నాలా వద్ద ఆటో ఇరుక్కుపోయింది. ఎర్రమంజిల్ శాంతి సౌధ అపార్ట్మెంట్లో చెట్టు విరిగి ప్రహరీ కూలింది.