సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : వాహనదారులు మంగళవారం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని కుదేలయ్యారు. కిలోమీటర్లు మేర వాహనాలు స్తంభించిపోవడంతో రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడిపారు. 20 నిమిషాల్లో గమ్యం చేరే మార్గాల్లో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఎదురుచూశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి వాహనదారులు అతలాకుతలమయ్యారు. మంగళవారం తెల్లవారు జాము 3 గంటలకు మొదలైన కుంభవృష్టి ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. అర్ధరాత్రి వరకు విడతల వారీగా నగరాన్ని భారీ వర్షం కుదిపేసింది.
గుడి, బడి, ఆసుపత్రి, బస్తీలు, కాలనీలు తేడా లేకుండా వరదనీరు ముంచెత్తింది. నాలా ఏదో, రోడ్డేదో గుర్తు పట్టనంతగా దారులు ఏరులయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి, రాయదుర్గం, గండిపేట, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డు, నాగోలు, బేగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంబర్‌పేట, మలక్‌పేట, డబీర్‌పురా, నల్లగొండ ఎక్స్ రోడ్డు, చాదర్‌ఘాట్, గోల్నాక, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైనే ఉండాలని డీజీపీ ఆదేశించినా ఫలితం లేదు. రోడ్లపై ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులు కనిపించడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి ఇష్టానుసారంగా వాహనాలు రావడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్గాల్లో గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే ఉన్నాయి. వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఎక్కడా కనిపించలేదు.
భారీ వర్షానికి ఐటీ ఉద్యోగులు చుక్కలు చూశారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురిసింది. వాహనాలు చాలా నెమ్మదిగా కదలడంతో వాహనదారులు ట్రాఫిక్ నరకం చూశారు. ఓ వైపు వర్షం..మరోవైపు ట్రాఫిక్ సమస్యతో వర్షంలో బిక్కుబిక్కుమంటూ నిశ్చేష్టులుగా మిగిలిపోయారు. మరోవైపు భారీ వర్షం కారణంగా రాంనగర్లో ఓ వాహనదారుడు వరదలో వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. ఇద్దరు యువకులు ఆ వాహనదారుడిని కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. టోలిచౌకిలోని రమాన్ హోటల్ వరద నీటిలో మునిగిపోయింది. పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర, వినోభానగర్ కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో దర్శనమిచ్చాయి. పార్సిగుట్టలోని అన్ని కాలనీల్లో ఇంట్లోకి నీరు చేరింది.
భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. కొన్ని చోట్ల కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. సికింద్రాబాద్‌లోని మైలార్‌గడ్డ, సీతాఫల్మండి, ఉప్పల్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు.
భారీ వర్షం కారణంగా రోడ్డు పైనే నీరు నిలువడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. భారీ వర్షానికి తోడు మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో వాహన చోదకులకు సాయంత్రమే చుక్కలు కనిపించాయి. హైటెక్‌సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తాడ్బన్, బోయిన్పల్లి, న్యూబోయిన్‌పల్లి, సుచిత్ర మార్గంలో రాకపోకలు కొనసాగించిన ప్రయాణికులు, వాహనచోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లాల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు, తొందరగా వెళ్లాలనుకున్న సరుకు వాహనాలు, ఆటోలు, కార్లు ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించడంతో స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి.