Hussain Sagar | మలక్‌పేట, ఆగస్టు 9 : నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలటంతో మూసీలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జిని, దోబీ ఘాట్‌ను తాకుతూ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను గోల్నాక న్యూబ్రిడ్జి మీదుగా మళ్లించారు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై ఒక పక్కకు కొత్త బ్రిఢ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో మరో పక్క నుంచి మూసారాంబాగ్ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలను సింగిల్ వేలో అంబర్‌పేట వైపు వెళ్లేందుకు అనుమతించారు. అంబర్‌పేట నుంచి మూసారాంబాగ్ వైపు వచ్చే వహనాలను గోల్నాక న్యూబ్రిడ్జి వైపు మళ్లించారు. అయితే మూసీలో వరద పరిస్థితులను జీహెచ్ఎంసీ, రెవెన్యూ, హైడ్రా అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి కన్నా శనివారం ఉదయం నుంచి వరద ప్రవాహం పెరిగిందని, మరిన్ని గేట్లు ఎత్తితే వరద ప్రవాహం బ్రిడ్జి పైనుంచి వెళ్లే అవకాశాలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.