సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో సాధారణం కంటే ఏకంగా 65 శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒక వంతైతే.. రెండు నెలల వర్షపాతం కేవలం నాలుగైదు రోజుల్లోనే కుమ్మరించడం..అందులోనూ రెండు సెంటీమీటర్లకే అతలాకుతలమయ్యే నగరంలో గంటల వ్యవధిలోనే 28 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిస్తే ఆ వర్షం బీభత్సం ఊహించలేం. సరిగ్గా 2020 అక్టోబరు మాసంలో వరుణుడు తన ప్రతాపాన్ని భారీ ఎత్తున చూపించాడు. దీంతో నగరవాసుల జీవనం చిన్నాభిన్నమైంది. రోజుల తరబడి నీళ్లలోనే నగరవాసులు జీవనం గడిపారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం వరద ముంపునకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో వరద ముంపు బెడద లేకుండా ఉండేందుకుగా ప్రభుత్వం స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులకు శ్రీకారం చుట్టింది.
తొలి విడత రూ.985.45 కోట్లతో 57 చోట్ల చేపట్టిన పనులు దాదాపుగా 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా చార్మినార్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో 100 శాతం పనులు పూర్తి చేసుకుని వరద గండం శాశ్వతంగా తొలిగిపోయింది. గతంలో చినుకుపడితేనే జలదిగ్భంధంలోకి వెళ్లే అనేక కాలనీలు ఇప్పుడు నిశ్చింతగాంగా ఉన్నాయంటే కేవలం ఎస్ఎన్డీపీ పథకం కింద చేపట్టిన పనుల ఫలితమేనని నగరవాసులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ముఖ్యంగా నల్ల పోచమ్మ టెంపుల్ వీఎస్టీ నుంచి విద్యానగర్ నాలా బ్రిడ్జి, నాగమయ్యకుంట హెరిటేజ్ షాపు నుంచి వెజిటేబుల్ మార్కెట్ రోడ్ నాలా బ్రిడ్జి, పికెట్ నాలా కరాచీ బేకరీ ఎస్పీ రోడ్ బ్రిడ్జి, ఫాక్స్ సాగర్ సర్ప్లస్ కెమికల్ నాలా, ఫాక్స్‌సాగర్ వెన్నెలగడ్డ చెరువు, అల్వాల్ మోదుకుల కుంట నుంచి కొత్త చెరువు, ఎల్బీనగర్ బాతుల చెరువు నుంచి ఇంజాపూర్ నాలా, మన్సురాబాద్ చిన్న చెరువు నుంచి బండ్లగూడ చెరువు, బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు, చాంద్రాయణగుట్ట నూరినగర్ నుంచి డెక్కన్ ప్లేస్, రాజేంద్రనగర్ అప్పా చెరువు నుంచి మల్గంద్ లేక్, పటాన్చెరువు రాయసముద్రం -నక్కవాగు, ఇసుక వాగు, చందానగర్-ఈర్ల చెరువు-ఎన్‌హెచ్-65 తదితర ప్రాంతాలలో వరద గండం శాశ్వతంగా తొలగిపోయింది.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ)తో మరో రెండు హుస్సేన్‌సాగర్ సర్ప్లస్ నాలా, బుల్కాపూర్ నాలా పనులను యుద్ధ ప్రాతిపదికన జరుపుతుండగా.. రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండో దశలో రూ. 5135.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో జీహెచ్ఎంసీకి సంబంధించి 148 పనులకుగానూ రూ. 2141.22 కోట్లతో, శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో రూ.2993.93 కోట్లకు 267 చోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు.