హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad ) ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ రోడ్డుపై బస్సును ఆపేసి ప్రయాణికులను దింపేశారు. క్రమంగా మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.
బస్సులోని ఏసీ విభాగం నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో కూకట్పల్లి, పంజాగుట్ట మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ మొత్తం పొగతో నిండిపోయింది. అయితే అప్పటికే మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.