NIMS | ఖైరతాబాద్, ఏప్రిల్ 20 : వేలాది మంది రోగులు, వందలాది మంది వైద్య సిబ్బంది, 24/7 సెక్యూరిటీ గార్డుల పహారా.. అన్నింటినీ దాటుకుంటూ అగ్ని ప్రమాదకారకాలైన పటాకులు నిమ్స్ ఆస్పత్రికి చేరాయి. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులోని ఆడిటోరియాన్ని ఆనుకొని ఉన్న ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వీటిని నిల్వ చేశారు. శనివారం మధ్యాహ్నం నిమ్స్ ఆడిటోరియంలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఈ భద్రతా వైఫల్యం బయటపడింది.
శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగిన ఈఎండీ వార్డులోనే పల్మనాలజీ, వాస్కూలర్, న్యూరో సర్జరీ, ఐసీయూ తదితర విభాగాలు ఉన్నాయి. ఒకవేళ మంటలు క్రమంగా వ్యాపించి పటాకుల స్టాకుగా ఉన్న గది వరకు చేరి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్ దవాఖానకు నిత్యం 3,500 మంది రోగులు వివిధ చికిత్సల కోసం ఆస్పత్రికి వస్తుంటారు. డైరెక్టర్‌తో సహా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వివిధ విభాగాలకు చెందిన నిష్ణాతులైన వైద్యులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిత్యం రోగులకు వైద్య సేవలందించడంలోనే తలమునకలవుతారు. ఈ నేపథ్యంలో అందరి భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ పటాకులు దర్శనమిచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగిన క్రమంలో పటాకుల విషయంలో విచారణ చేయాలని స్వయంగా నిమ్స్ వైద్యాధికారి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిన్న దర్శనం….నేడు మాయం
నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులోని ఐదో అంతస్తులో ఉన్న ఆడిటోరియంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నిమ్స్ సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ఎస్టింగ్యూషర్లతో ఆర్పివేశారు. అదే క్రమంలో దానికి ఆనుకొని ఉన్న ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పటాకులు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పటాకులు ఎవరు తెచ్చారని ఆరా తీస్తే.. అందరి నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. పటాకుల విషయంపై నిమ్స్ వైద్యాధికారి ఒకరు పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల బృందం నిమ్స్ దవాఖానలోని సదరు కార్యాలయానికి వచ్చి పరిశీలించగా అక్కడి నుంచి పటాకులు మాయమయ్యాయి. అసలు తెచ్చిందెవరూ.. మాయం చేసిందెవరూ.. దీని వెనుక ఉన్నదెవరూ.. 24 గంటల్లో ఎలా మాయమయ్యాయి….తెచ్చిన వారే మాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.