సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ వేళ.. అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓల్డ్ సిటీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మొన్న బొగ్గులకుంటలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇందుకు అధికారుల ధనదాహమే కారణమంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం, ఇండ్లల్లో పటాకులు నిల్వ చేయడం వల్లే ఊహించని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
దీపావళి వచ్చిందంటే చాలు.. తాత్కాలిక పటాకుల దుకాణాల లైసెన్స్‌లతో పోలీసులు, ఫైర్, జీహెచ్ఎంసీ శాఖలకు పైసలే పైసలు. దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ఆయా శాఖలకు మాముళ్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే ఇబ్బందులు సృష్టించి నానా యాగి చేస్తుంటారనే నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. మాముళ్లు ముట్టడంతో జనావాసాల మధ్యనే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మొన్న బొగ్గులకుంటలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దుకాణం ఏర్పాటుకు అనుమతి ఒకచోట తీసుకొని.. మరో చోటు ఏర్పాటు చేశారు. లైసెన్స్ జారీ చేసిన అధికారులు చూసి కూడా.. చూడనట్టు వ్యవహరించారని, జనావాసల మధ్య పటాకుల దుకాణం ఏంటని స్థానికులు నిలదీశారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లో ఇప్పటికే 700లకు పైగా దుకాణాలు వెలిశాయి. గురువారం నాటికి అధికారికంగా, అనధికారికంగా 1500 వరకు దుకాణాలు రోడ్లపై వెలిసే అవకాశాలున్నాయి. వీటికి తోడు జనావాసాల మధ్య ఉన్న భారీ గోదాములలో పెద్ద ఎత్తున పటాకులు నిల్వ చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
దుకాణాల ఏర్పాటుకు తాత్కాలిక లైసెన్స్ తీసుకోవడం, గోదాములలో భారీగా పటాకులు నిల్వ ఉంచి.. బడా వ్యాపారుల నుంచి చిన్న చిన్న వ్యాపారుల వరకు పటాకులు విక్రయిస్తుంటారు. ఈ దుకాణాలకు తప్పనిసరిగా సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, తాత్కాలిక లైసెన్స్ జారీ చేసేందుకు దుకాణం స్థాయిని బట్టి రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు అధికారులు మాముళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ఆ జోన్లో ఉండే ఉన్నతాధికారుల వరకు ఈ పంపకాలు జరగుతున్నాయని, వీటికి తోడు ఫైర్, జీహెచ్ఎంసీల సిబ్బందికి కూడా ఎంతో కొంత ఇచ్చి వ్యాపారం చేస్తున్నారని తెలిసింది.
మేము ఉన్నాం.. అని చెప్పుకొనేందుకు రెండు మూడు చోట్ల నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు జనావాసాల మధ్య ఉన్న గోదాములపై దాడులు నిర్వహించారు. ఎక్కువగా సెంట్రల్ జోన్ పరిధిలోనే ఈ దాడులు జరిగాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీ ఎత్తున పటాకుల గోదాములు ఉన్నా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మాముళ్ల మత్తులో మునిగిన సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. నిర్వాహకుల ఇష్టారాజ్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అబిడ్స్, అక్టోబర్ 29: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటవ తేదీ నుంచి నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు పోలీసుల నుంచి అనుమతి కోరుతూ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్, సభ్యులు ధీరజ్ జైస్వాల్ మంగళవారం కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించే నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. అనుమతులు రాగానే ఏర్పాట్లు చేపడతామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
చార్మినార్, అక్టోబర్ 29: అంతా పండుగ సంబురాల్లో మునిగిపోగా.. వారింట మాత్రం ఈ దీపావళి విషాదాన్ని నింపింది. సోమవారం అర్ధరాత్రి రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంలో భార్యాభర్తలు, కూతురు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చందానగర్ ప్రాంతానికి చెందిన మోహన్‌లాల్ (55), ఉషాబాయి (50) దంపతులు. వీరి కూతురు శ్రుతి (15). దీపావళి సందర్భంగా స్థానికంగా పటాకుల వ్యాపారం చేసేందుకు నిర్ణయించుకుని, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పటాకులు తీసుకొచ్చారు. వాటిని ఇంటిలోనే నిల్వచేసిన మోహన్‌లాల్ కుటుంబ సభ్యులు.. ఎప్పటిలాగానే సోమవారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తరువాత పటాకులు నిల్వ ఉంచిన గదిలో కరెంట్ షార్టు సర్క్యూట్‌తో నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పటాకులు పేలుతూ.. ఆ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలతో సిలిండర్ సైతం పేలిపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో మోహన్‌లాల్‌తో పాటు అతడి భార్య ఉషాబాయి, కూతురు శ్రుతి తీవ్ర గాయాలతో మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నట్టు రెయిన్ బజార్ పోలీసులు తెలిపారు.