AIG Hospital | కొండాపూర్, జూన్ 7 : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో శనివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్క్ చేసిన అంబులెన్స్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం.