Fire Accident | మణికొండ,ఫిబ్రవరి 24 : నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జనావాసాల మధ్య ఏర్పాటైన ఫర్నీచర్ గోదాంలో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ఉన్న నివాసితుల ఇళ్లకు కూడా వ్యాపించింది. దీంతో ఇళ్లలోని సామగ్రి కూడా దగ్ధమైంది. విద్యుత్ శాఖ, మున్సిపల్, అగ్నిమాపక శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. గత కొన్నాళ్లుగా జనావాసాల మధ్యలో ఫర్నిచర్ గోదాంలను ఏర్పాటు చేయవద్దంటూ మున్సిపాలిటీ, విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా అనుమతులను ఇవ్వడంతోనే ఈరోజు తమ ప్రాణాలమీదకు వచ్చిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మణికొండ గీతాంజలి పాఠశాల సమీపంలోని మలేషియా సోఫా సెట్ ఫర్నిచర్ గోదాంలో విద్యుత్ షాక్‌తో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్ గోదాంలో ఎగిసిపడిన మంటలు కాస్త.. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు కూడా వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్లోని నాలుగు ఏసీ కంప్రెషర్లు, పార్కింగ్‌లో ఉన్న రెండు కార్లు మంటల్లో కాలిపోయాయి. జనావాసాల మధ్యలో ఫర్నిచర్ గోదాంలు ఏర్పాటు చేయవద్దంటూ గతంలో మణికొండ మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా డబ్బులు తీసుకుని అనుమతులు ఇవ్వడంతో ఇలాంటి పరిస్థితులు దాపురించాయని స్థానిక మహిళలు మండిపడుతున్నారు. ఇదే ప్రమాదం రాత్రిపూట జరిగితే ప్రాణాలు పోయేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన నిర్వాహకులు అక్కడ నుంచి పరారయ్యారని, నిర్వాహకులపై, భూమి యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గంట తర్వాత వచ్చిన అగ్నిమాపక బృందం
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన విషయం తెలిసిన గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది రావడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫర్నిచర్ గోదాం వరకు ఫైర్ ఇంజన్ రావడానికి కూడా రహదారి సక్రమంగా లేకపోవడంతో సమస్య తలెత్తిందని స్థానిక ప్రజలు ఆరోపించారు. పక్కనే నిర్మించిన అపార్టుమెంటు సైతం నిబంధనలకు విరుద్దంగా నిర్మించడంతో ఆస్తి నష్టం జరిగింది. సమయానికి ఫైరింజన్ రాలేకపోవడంతో అధికంగా ఫర్నీచర్ వస్తువులు కాలిబూడిద అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం: నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి
జనావాసాల మధ్యలో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ గోదాం నిర్వాహకులతో పాటు భూ యజమానిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. స్థానికుల నుంచి అభ్యంతరాలు ఉంటే గోదాంలు ఏర్పాటు చేయవద్దని ఆయన సూచించారు. ఇదే ప్రమాదం రాత్రిపూట జరిగితే ప్రమాద తీవ్రత భారీగా ఉండేదని ఇన్స్పెక్టర్ అన్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇకపై ఏర్పాటైయ్యే ఫర్నిచర్ గోదాంలకు సరియైన అనుమతులు లేకపోతే సీజ్ చేసేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.