Medchal | మేడ్చల్, జూన్15 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజుల కోసం కళాశాలల యజమన్యాలు ఒత్తిడి తేవడంతో ఫీజులు కట్టలేక ఎటు తేల్చుకోలేక పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ నుంచి పీజీ వరకు ఎస్సీ విద్యార్థులు 28 వేలు, బీసీ విద్యార్థులు 40 వేలు, మైనార్టీ, ముస్లింలు 15 వేల మంది విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్పై అధారపడి చదువుకుంటున్నారు. సుమారు రూ. 3 వందల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థుల ఖాతాలలో వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు త్రీవ ఇబ్బందులను తెచ్చిపెట్టినట్లయింది. కళాశాల యజమన్యాలు విద్యార్థులుపై ఒత్తిడి తేస్తే విద్యార్థులు అధికారుల చుట్టు తిరాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2023 నుంచి 2025 విద్యాసంవత్సరం వరకు వివిధ కళాశాలలకు ఫీజు రీయంబర్స్మెంట్ను చెల్లించాల్సి ఉంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ను మొదట నిబంధనల మేరకు విద్యార్థుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం జమ చేయాల్సి ఉంటుంది. జమ చేసిన నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపితే మిగతా 60 శాతం నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల జమ కానుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయని కారణంగా ఫీజు రీయంబర్స్మెంట్లో అలస్యం అవుతుందని తెలుస్తోంది. గతంలో ఫీజు రీయంబర్స్మెంట్ నేరుగా విద్యాసంస్థలకే వెళ్లనుండగా కొత్త నిబంధనల మేరకు విద్యార్థుల ఖాతాలలోనే జమ చేయలన్నా నిబంధనలు ఇబ్బందులు తెచ్చాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరు వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫీజు రీయంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 86 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు అందిచాల్సి ఉంది.