మేడ్చల్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారుపై నిరసనలకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. రుణమాఫీ, సన్నరకం వడ్లకు బోనస్ జమచేయకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట మోసం, విద్యుత్ లైన్ల సవరించకపోవడంపై గుర్రుగా ఉన్న అన్నదాతలు పోరుబాట పట్టనున్నారు. ఈమేరకు ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తేవాలని నిర్ణయించగా, సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రైతు సమాఖ్య కలెక్టరేట్‌కు భారీగా చేరుకొని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నది. అయినా స్పందించకపోతే తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామని స్పష్టంచేసింది.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 8 కిలోల తరుగు తీయడంతో తీవ్రంగా నష్టపోతున్నట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్, వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లి అన్నదాతలకు జరుగుతున్న మోసాన్ని అరికట్టాలని కోరనున్నారు. అలాగే భూభారతి రైతులకు మేలు చేస్తుందని రేవంత్ సర్కారు చెప్పినా ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. అంతేగాక మొక్కుబడిగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులు పరిశీలనకు మాత్రమే పరిమితమయ్యాయని మండిపడుతున్నారు.
గత యాసంగిలో కొనుగోలు చేసిన 32 వేల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యానికి రూ.కోటి 60 లక్షలను ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. జిల్లాలో 49,725మంది రైతులకు గాను 25వేల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింపజేశారు. దీంతో మిగతా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
పంట పొలాల్లో విద్యుత్ లైన్లను సవరించడంలో ఆ శాఖ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఒక్కోసారి తీగలు సాగి వేలాడటం వల్ల సాగు పనుల్లో ఉన్న రైతులకు తాకి తగిలి మృత్యువాతపడుతున్నారు. వెంటనే లైన్లను సరిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.