Fourth City | కందుకూరు, మే 16 : ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని అధికారులకు రైతులు తెలిపారు. కందుకూరు మండల పరిధిలోని రాచులూరు గ్రామంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ నేతృత్వంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇవ్వాలని రైతులను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, తహసీల్దార్ గోపాల్ కోరారు. కానీ దానికి రైతులు అంగీకరించలేదు.
తామంతా చిన్న, సన్నకారు రైతులమని.. వాటిపైనే తాము ఆధారపడి బతుకుతున్నామని ఈ సందర్భంగా అధికారులకు రైతులు వివరించారు. ఆ భూములను తీసుకుంటే బజారున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు విలువైనవని.. మార్కెట్లో ఆ భూములకు ఎకరాకు రూ.5కోట్లు పలుకుతుందని.. ఆ రేటు చెల్లించి భూములను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అందుకు అంగీకరించనిపక్షంలో ప్రభుత్వం ఎకరాకు రూ.3కోట్లు చెల్లించి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇస్తుందో చెప్పకుండా గ్రామ సభలు నిర్వహించడంలో ఆంతర్యమేంటని రైతులు ప్రశ్నించారు. మా భూములపై మీ పెత్తనం ఏంటని అధికారులను నిలదీశారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే భూములు ఇస్తామని.. లేనిపక్షంలో ఎట్టిపరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
రైతుల డిమాండ్లపై అధికారులు స్పందిస్తూ.. ఫోర్త్ సిటీ రోడ్డులో ఎంతమంది రైతుల భూములు పూర్తిగా పోతున్నాయో గుర్తించి, వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో 18సంవత్సరాలు నిండినవారు ఎంతమంది ఉన్నారో వారందరికీ రూ.5.50 లక్షల చొప్పున అదనంగా చెల్లిస్తామని తెలిపారు.