మేడ్చల్/కీసర జూన్19 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ రైతు భరోసా అందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒకే మండలానికి రైతు భరోసాను వర్తింపజేశారని మిగతా మండలాల రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. కీసరలోని ప్రధాన చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు ఆందోళన చేశారు. జిల్లాలోని రింగ్ రోడ్డు సమీపంలోని భూములున్న ఏ ఒక్క రైతుకు రైతుభరోసా అందకపోడతో గురువారం జిల్లా కలెక్టరేట్ మను చౌదరిని రైతులు కలిశారు.
జిల్లాలోని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, దుండిగల్, కుత్బుల్లాపూర్, అల్వాల్ మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా జమ కాలేదని డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. మూడుచింతలపల్లి మండలానికి మాత్రమే 4,624 మంది రైతులకు మాత్రమే పరిమితం చేశారని ఆరోపించారు. రైతు భరోసాను రైతులందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మను చౌదరికి వినతి పత్రం అందజేశారు.
రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో 45,067 ఎకరాల విస్తీర్ణంలో 49,727 మంది రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారని దీనికి రూ. 27 కోట్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో రైతు భరోసా ఖాతాల్లో జమ చేయకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని తెలిపారు.