మేడ్చల్, నవంబర్26(నమస్తే తెలంగాణ) ;కాంగ్రెస్ హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతుబంధు పథకాన్ని విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. రైతుబంధు పథకాన్ని భూమి యజమాని లేదా కౌలు రైతుల్లో ఎవరో ఒకరికే ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకే బూటకపు హామీలను ఇస్తూ రైతులను మోసం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఇలా మాట్లాడితే.. అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తామని, రైతులకు భారంగా మారే 10 హెచ్‌పీ మోటర్లు పెడుతామంటూ కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వ్యవసాయం మాన్పించేలా కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలపై రైతులు భగ్గుమంటున్నారు.
పట్టాదారులకు నష్టం చేస్తే సహించం
పట్టాదారులకు లేదా కౌలు రైతుల్లో ఎవరో ఒకరికి రైతుబంధు ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించడం అన్యా యం. రేవంత్‌రెడ్డికి రైతులే బుద్ధి చెబుతారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చూస్తాం. రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. గతంలో రైతులు పడ్డ గోసలను తీర్చిండు మన సీఎం కేసీఆర్. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు అండగా ఉన్నరు. రైతులు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి కింద రైతుబంధు ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నడు.
– పినింటి దేశమంత్రెడ్డి, రైతు, కీసర
పుట్ట గతులుండవు..
రైతాంగాన్ని మోసం చేసే పార్టీలు, ప్రభుత్వాలకు పుట్ట గతులుండవు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే.. పట్టా రైతులకు మొండి చెయ్యి చూపించి.. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామనడం ఘోరం. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన రీతిలో మూల్యం చెల్లిస్తాం. సీఎం కేసీఆర్.. రైతాంగం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి రైతులను పూర్తిగా దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు, రైతులు ఓటుతోనే బుద్ధి చెప్పడం ఖాయం.
– రామిడి బాల్‌రెడ్డి, రైతు, నూకలగూడెం
కాంగ్రెస్‌కు నూకలు చెల్లినయి..
రైతుల విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయి. పట్టాదారు రైతులను కాదని కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామనడం అన్యా యం. రైతాంగం కోసం మంచి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను వదులుకోం. రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఆ పార్టీని రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేస్తాం. మళ్లీ కేసీఆర్‌కు ఓట్లేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులకు, ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదు. వారి గత పాలనలో రైతులు అంతా అప్పుల పాలయ్యారు.
– మెట్టు బాలయ్య యాదవ్, రైతు, కీసర
కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలే..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తెలిపోయింది. భూ యజమానులకు నష్టం చేసే విధంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడటం సరైంది కాదు. కౌలు రైతులకు లాభం చేకూర్చేలా ప్రకటనలు చేయడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయంతో వ్యవసాయం పండుగలా చేస్తున్నం. రైతులతో కాంగ్రెస్ ఆటలాడుతోంది. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కే మేం మద్దతుగా ఉంటాం.
– హరి, రైతు, శామీర్‌పేట్
కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునుగుతం..
కాంగ్రెస్ పార్టీవి బూటకపు మాటలు. ఆ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన పథకాలపై రెండు రకాలుగా నాయకులు మాట్లాడుతున్నారు. రైతుబంధు పథకంపై స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు మాటలు మాట్లాడితే ఎలా. పట్టాదారులు లేదా కౌలు రైతుల్లో ఒకరికి మాత్రమే రైతుబంధు ఇస్తామనడం దుర్మార్గం. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే రైతులు నట్టేట మునగడం ఖాయం. రైతుకు భరోసా ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే అండగా ఉంటాం.
– భిక్షపతి, రైతు, మూడుచింతలపల్లి
ఫూటకోమాట మాట్లాడుతున్నరు..
రైతులను మోసం చేసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫూటకోమాట మాట్లాడుతున్నరు. భూమి యజమాని లేదా కౌలు రైతుల్లో ఎవరో ఒకరికే రైతుబంధు ఇస్తామని చెబుతున్నరు. అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే.. వస్తే రైతులను ఏం చేస్తరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావు. ఆ పార్టీపై నమ్మకం ఎట్ల ఉంటది. కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయంపై అవగాహన లేదని తేలిపోయింది. రైతుబంధు పథకం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందజేస్తూ అండగా ఉంటోంది.
– దశరథ్, రైతు, మూడుచింతలపల్లి
కాంగ్రెస్‌ను రైతులు నమ్మరు..
రైతులను ఆందోళనకు గురి చేసేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుండ్రు. ఇచ్చిన హామీలపై రెండు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను రైతులు నమ్మరు. ఆ మాటలు వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయి. పట్టాదారును కాదని, కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామనడం దుర్మార్గమైన చర్య. రైతులు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ హామీలన్నీ ఉత్త మాటలని తేలిపోయింది. బీఆర్ఎస్ పాలనలో ధరణి, రైతుబంధుతో రైతులకు లాభం జరిగింది.
– తుకారం, రైతు, శామీర్‌పేట్
రైతుబంధును విభజించే కుట్ర..
రైతుబంధు పథకాన్ని విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేయాలని చూస్తోంది. ఈ పథకం సాఫీగా సాగుతుంటే ఆ పార్టీ నాయకులకు కన్ను కుడుతుంది. భూ యజమానులకు లేదా కౌలు రైతుల్లో ఒకరికి మాత్రమే రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటనలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను మోసం చేయాలని చూస్తోంది. రైతులు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ హామీలన్నీ ఉత్తమాటలే అని తేలిపోయింది. ఆ పార్టీని రైతులు నమ్మే పరిస్థితిలో లేరు.
– మధుకర్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
రేవంత్ రెడ్డికి మైండ్ దొబ్బింది
ఏమి మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డికి తెలుస్తలేదు. ఒకసారి కౌలు రైతుకు రైతుబంధు ఇస్తమంటరు.. ఒకసారి ఇద్దరికి ఇస్తాం అంటరు. ఆయన మాట మీద ఆయనకే క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డికి మైండ్ దొబ్బింది.కౌలు రైతుకే రైతుబంధు ఇస్తామంటే భూమిని కౌలుకు ఇచ్చేందుకు ఎవరైనా ముందుకు వస్తారా?. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో రాగానే ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను అమలు చేస్తుంది. కాంగ్రెస్ వస్తే రైతులు ఆగమవుతరు.
– నందారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్