రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో భాగంగా మంగళవారం కొందుర్గు మండలంలోని ముట్పూర్, చుక్కమెట్టు, షాబాద్ మండలంలోని నాగరకుంట, బోనగిరిపల్లి, మాచన్‌పల్లి, కందుకూరు మండలంలోని తిమ్మాయపల్లి, చౌదరిగూడ మండలంలోని లచ్చంపేట తదితర గ్రామాల్లో అధికారులు రైతులతో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ.. రేడియల్ రోడ్లతో తమకు ఎ లాంటి ప్రయోజనం లేదన్నారు. తాము తాతల కాలం నుంచి ఆ భూములనే సాగు చేసుకుని జీవిస్తున్నామని.. అవి లేకుంటే తమకు బతుకులేదని ఆవేదన వ్యక్తం చేశారు.నష్టపరిహారం ఇస్తే తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని.. భూమికి భూమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులిస్తామని.. భూములిచ్చేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
– రంగారెడ్డి, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/ కొందుర్గు/షాబాద్/ కందుకూరు

రంగారెడ్డి, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/ కొందుర్గు/ షాబాద్/ కందుకూరు: ప్రభుత్వం జిల్లాలో చేస్తున్న భూసేకరణలో భాగంగా మంగళవారం కందుకూరు, కొందుర్గు, చౌదరిగూడ, షాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి రైతులతో గ్రామసభలు నిర్వహించారు. కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని ముట్పూరు, చుక్కమెట్టు, ఉమ్మెంతాల్, లాలాపేట, లచ్చంపేట గ్రామాల్లో అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభలు జరిగియి. ముట్పూరులో 93 ఎకరాలు, చుక్కమెట్టులో 8, ఉమ్మెంతాల్‌లో 34, లచ్చంపేటలో 33.34 ఎకరాల పట్టా భూములు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
ఆ భూములు కోల్పోతున్న రైతులతో జాయింట్ కలెక్టర్ గ్రామసభలు ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని తెగేసి చెప్పారు. అలాగే, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిమ్మాయపల్లిలోని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 12 సర్వేనంబర్లలోని పట్టా భూములు, 14 సర్వేనంబర్లలో టీజీఐఐసీకి చెందిన మొత్తం 63 ఎకరాలను పరిశ్రమల అవసరాల పేరుతో తీసుకోవాలని నిర్ణయించి.. ఈ పట్టా భూములకు చెందిన రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కొందుర్గు, చౌదరిగూడలో..
కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని పలు గ్రామాల్లో రేడియల్ రోడ్డు కోసం 168 ఎకరాల పట్టా భూములను 300 మంది రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కొడంగల్ సమీపంలోని ఆర్ఆర్ఆర్ వరకు ఏర్పాటు చేసే రేడియల్ రోడ్డు కోసం ఈ భూములను తీసుకుంటున్నారు. కొందుర్గు మండలంలోని ముట్పూరులో 93 ఎకరాలు, చుక్కమెట్టులో 8, ఉమ్మెంతాల్‌లో 34, చౌదరిగూడ మండలంలోని లచ్చంపేటలో 33.34 ఎకరాలు రేడియల్ రోడ్డుకోసం తీసుకుంటున్నారు. ఇక్కడ భూమికి బదులు భూమే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
షాబాద్‌లో మండలంలో..
మా పొలాల్లో నుంచి రేడియల్ రోడ్డును నిర్మించొద్దని షాబాద్ మండలంలోని నాగరకుంట, బోనగిరిపల్లి, మాచన్‌పల్లి గ్రామాల రైతులు మంగళవారం షాబాద్‌లో డిప్యూటీ తహసీల్దార్ మధుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేడియల్ రోడ్డు మా పొలాల మీదుగా వెళ్తుందని అధికారులు సర్వేలు చేస్తున్నారని, ఆ పొలాలు పోతే మా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కందుకూరు మండలంలో..
కందుకూరు మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదని అధికారులకు తేల్చి చెప్పారు. సర్వేనంబర్ 1-13, 9, 11వ సర్వే నంబర్లను మినహాయించి, 14, 15 పట్టా సర్వేనంబర్లలోని దాదాపుగా 63 ఎకరాలను ప్రభుత్వం సేకరించి టీఎస్ఐఐసీకి అప్పగించేందుకు గ్రామంలో సభను నిర్వహించగా రైతులు అంగీకరించలేదు. తమ భూములు ఇచ్చేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, డీఏవో ,ఆర్ఐ యాదగిరి, సర్పంచ్ సురేశ్‌నాయక్, ఉప సర్పంచ్ కృష్ణ, రైతులు పాల్గొన్నారు.
పరిహారంపై స్పష్టత ఇవ్వని అధికారులు..
జిల్లాలో వివిధ అవసరాల పేరుతో ప్రభుత్వం సేకరిస్తున్న భూముల పరిహారంపై రైతులకు అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంలేదు. ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారమే ఇస్తామని చెబుతుండగా.. ఒక్కో గ్రామంలో మార్కెట్ ధర ఒక్కో విధం గా ఉన్నది. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలో మార్కెట్ విలువ ఎక్కువగా ఉండడంతో ఆ గ్రామంలో పరిహారం ఎక్కువగా వస్తుంది. కుర్మిద్ద, నానక్నగగర్, తాటిపర్తి గ్రామాల్లో మార్కెట్ విలువ తక్కువ ఉండడంతో పరిహారం తక్కువగా వచ్చే అవకాశమున్నట్టు రైతులు వాపోతున్నారు. భూసేకరణలో పరిహారం వేర్వేరుగా వచ్చే అవకాశముండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. పరిహారంతోపాటు పునరావాసం తదితర వాటిపైనా అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూమిని నమ్ముకొని బతుకుతున్నం..
నాకు ముట్పూర్లోని 185 సర్వేనంబర్‌లో రెండెకరాల పొలం ఉన్నది. ఆ భూమిలో ఆవుల షెడ్డుతోపాటు వ్యవసాయ పంటలను సాగు చేసుకొని జీవిస్తున్నా. మా భూమిలో 1.17 ఎకరాల భూమి రేడియల్ రోడ్డు సర్వేలో పోతున్నది. ఉన్న కొద్దిపాటి భూమి కూడా రోడ్డు కోసం పోతే నేను, నా కుటుబం ఎలా బతకాలి.
– సత్తమ్మ, ముట్పూరు, కొందుర్గు
రోడ్డులో భూమిపోతే ఎలా బతకాలి..
మా తాతల కాలం నుంచి ఈ భూమినే నమ్ముకొని జీవిస్తున్నా. చిన్నఉమ్మెంతాల గ్రామంలో నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. అందులో ఎకరం ఏడు గుంటల భూమి రేడియల్ రోడ్డులో పోతుందని తెలిసింది. భూమి పోతే ఎలా బతకాలి?. రోడ్డుకోసం భూమిని ఇచ్చే ప్రసక్తేలేదు.
– భూపాల్‌గౌడ్, చిన్నఉమ్మెంతాల, కొందుర్గు