Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలను కట్టడి చేయడానికి సెల్‌ఫోన్ కాలర్ ట్యూన్.. టీవీలు.. సోషల్మీడియాల ప్రకటనలతో అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. మారుమూల ప్రాంతాలల్లో కూడా ఈ మోసాల పరంపర నడుస్తున్నది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో వాట్సాప్‌లకు వస్తున్న మేసేజ్‌లు చూసి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రతి రోజు లక్షల రూపాయలు పొగొట్టుకొని బాధితులు సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేస్తున్నారు. అదే సెల్‌ఫోన్‌తో ఇతరులకు ఫోన్ చేస్తున్న సమయంలో పార్ట్‌టైమ్, పెట్టుబడుల పేరుతో వచ్చే మేసేజ్‌లు, ప్రకటనలను చూసి మోసపోవద్దంటూ కాలర్ ట్యూన్లో సమాచారం వస్తున్నా… ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అదే సెల్ఫోన్లో వచ్చే మేసేజ్‌లకు స్పందించి బాధితులు మోసపోతున్నారు.
మల్కాజిగిరికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి బ్రాండ్ మార్క్ అసోసియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక మేసేజ్ వచ్చింది, హోటల్స్, రెస్టారెంట్స్‌కు సంబంధించి గూగుల్ రివ్యూస్ రాస్తే ప్రతి రోజు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు సంపాదించవచ్చంటూ మేసేజ్ పంపించారు. ప్రతి రివ్యూకు రూ. 120 సంపాదించవచ్చంటూ నమ్మించి నమ్మకం కోసం మొదట కొంత డబ్బు చెల్లించారు. ఆ తరుఉవాత పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా రూ. 15.42 లక్షలు లాగేశారు.
మల్కాజిగిరికి చెందిన ఒక గృహిణి సెల్‌ఫోన్‌కు ప్లైప్సైడ్ గ్లోబల్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వీన ఖాత్రి అనే పేరుతో ఒక మేసేజ్ వచ్చింది, పార్ట్‌టైమ్ ఉద్యోగాలున్నాయి, మీరు ప్రతి రోజు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు సంపాదించుకునే అవకాశముంది, గుగూల్ రివ్యూస్ రాస్తే చాలు, ఒక రివ్యూకు రూ. 150 చెల్లిస్తామని ఆ మేసేజ్‌లో పేర్కొన్నారు. దీనికి అంగీకరించిన బాధితురాలు మొదటి సారి గూగుల్ రివ్యూ రాసి రూ.150 పొందింది. రూ. 1000 చెల్లిస్తే ఒకో రివ్యూకు రూ. 400 ఇస్తామంటూ సూచించడంతో వెయ్యి చెల్లించింది. ఆ తరువాత మీరు పెట్టుబడి పెంచితే లాభాలు ఎక్కువగా ఇస్తామంటూ నమ్మించి దఫ దఫాలుగా ఆమె వద్ద నుంచి రూ. 2.21 లక్షలు వసూలు చేసి, మోసం చేశారు.
ఇంజాపూర్కు చెందిన ఒక విద్యార్థికి ట్రాక్సిన్ టెక్నాలజీస్ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ ఇస్తుందని, గూగుల్ రివ్యూస్ రాస్తే రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు రోజు వారిగా సంపాదించవచ్చంటూ మేసేజ్ పంపించారు.ఆ మేసేజ్‌కు ఆకర్షితుడైన విద్యార్థి నేరగాళ్లు పంపించిన లింక్‌ను క్లిక్ చేసి ఒక యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. ఆ తరువాత మీరు కొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే భారీగా డబ్బు సంపాదింవచ్చని, క్రిప్టో కరెన్సీలో ఆ పెట్టుబడి పెట్టాలంటూ సూచించారు. మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి వచ్చే లాభాలు మీకు స్కీన్ప్రై ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతుంటాయని చెప్పాడు. దీంతో బాధితుడు దఫ దఫాలుగా రూ. 3.25 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు.