‘మీకందరికీ తెలుసు ముఖ్యంగా రాజకీయ నాయకులకు.. ఎవరితోనైనా చెలగాటమాడొచ్చు కానీ టీచర్లతో చెలగాటమాడితే ఏమీ అనరు.. పోలింగ్ బూత్‌ల్లో మాత్రం వాళ్లు చెయ్యాల్సింది చేస్తారు.’ ఇది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు.
‘నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన. అబ్దుల్ కలాం కూడా సర్కారీ స్కూల్లోనే చదువుకొని రాష్ట్రపతి అయ్యారు. అట్లాంటి నిర్మాతలను నిర్మించే క్షేత్రమే ప్రభుత్వ పాఠశాల. మేం ఉద్యోగాలు ఇస్తుంటే కొందరు కండ్లల్లో నిప్పులు చల్లుకుంటున్నారు. .’ ఇది సర్కారీ బడుల గొప్పతనం గురించి సీఎం రేవంత్ చెప్పిన మాటలు.
‘30వేల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 24 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటులో పది వేల పాఠశాలలు ఉంటే 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి నేను అడుగుతున్న ప్రైవేటు పాఠశాలల్లో మీకన్న గొప్పగా చదువుకున్న వాళ్లు ఉన్నారా? మీకన్న గొప్పోళ్లు ఉన్నారా?’ ఇది టీచర్ల కు నియామక పత్రాలు అందించిన కార్యక్రమంలో సీఎం చెప్పిన మాటలు.
‘సీఎం చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. సర్కారీ బడుల్లో చదివితే గొప్పోళ్లు అవుతారు. అయితే అందులో పాఠాలు బోధించాల్సిన వాళ్లు నిష్ణాతులై ఉండాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇటీవల భర్తీ చేసిన డీఎస్సీ 2024 టీచర్ పోస్టుల్లో తప్పుడు పత్రాలు చూపించి ఉద్యోగాలు పొందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఎంతో గొప్పగా టీచర్లను భర్తీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నది. ఈ ప్రక్రియ అంతా డొల్ల అని తేలిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో 584 మందికి పోస్టింగ్ ఇస్తే ఇందులో 57 మంది తప్పుడు పత్రాలతో చలామణి అవుతుతుండటం విశేషం. ’
DSC 2024 | సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ అధికారులు డీఎస్సీ-2024 నియామక పత్రాలు అందించే ముందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ సాఫీగా జరగకపోవడంతోనే దొంగ పంతుళ్లు ఎంటరయ్యారని డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 57 మంది టీచర్లు తప్పుడు పత్రాలతో కొలువు పొందారు. వీరిలో 27 మంది నియామకాలను పక్కనపెట్టి వారి వివరాలను ఆరా తీస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో కమిటీ పర్యవేక్షిస్తున్నది. అయితే పరిశీలనలో భాగంగా ఆ టీచర్లకు సంబంధించిన జిల్లాల్లోనూ విచారణ జరుగుతున్నది. ఈ బాధ్యతను ఆయా సంబంధిత జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.
ఆధార్‌తో ఆరా..
హైదరాబాద్‌లో డీఎస్సీ 2024లో 584 మంది అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారు. 878 పోస్టులకు కోర్టు కేసులు, రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థుల కొరత, ఇన్ సర్వీస్ తదితర కారణాలతో 262 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. 584లో 27 మంది తప్పుడు పత్రాలు సమర్పించి.. కొలువు పొందారని ఫిర్యాదుల రావడంతో వారిపై విచారణ జరుగుతున్నది. వాళ్లంతా తప్పుడు పత్రాలు సమర్పించినట్టు తేలింది. అయితే ఈ క్రమంలోనే మరో 30 మంది టీచర్లు సైతం తప్పుడు పత్రాలు సమర్పించినట్టు తెలిసింది. హైదరాబాద్ స్థానికత కోసం మూసివేసిన పాఠశాలల్లో చదివినట్టు చూపించారు. వాస్తవానికి ఆ పాఠశాలల్లో వాళ్లు చదివినట్టు వివరాలు లేకపోవడం, కొన్ని పాఠశాలల రిజిస్టర్లో కొత్తగా పేర్లు ఎంటర్ చేసినట్టు ఉండటం, మధ్యలో పేర్లు ఎంటర్ చేయడం లాంటివి విచారణ కమిటీ పరిశీలనలో తేలింది. దీంతో పాటు టీజీపీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న సమయంలో జత చేసిన సర్టిఫికెట్లను సైతం అధికారులు తెప్పించుకున్నారు.
వారి ఆధార్ నంబర్ ఆధారంగా వారు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న పోస్టుల వివరాలు తీసుకున్నారు. ఈ పరిశీలనలో టీచర్ల భర్తీ సమయంలో చూపించిన పత్రాలకు వాటికి పొంతన లేదనే విషయం తేలింది. విచారణలో ఇప్పటికే తేలిన కొంతమంది దొంగ పంతుళ్లపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని హైదరాబాద్ కలెక్టర్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పూర్తి రిపోర్టు ఇవ్వాలని విచారణ కమిటీని ఆదేశించారు. ఇప్పటికే ఆ టీచర్లను పిలిపించి విచారణ కమిటీ ముందర హాజరుపరిచారు. అందులో కొందరు తమవి తప్పుడు పత్రాలేనని ఒప్పుకున్నారు. ఇంకొందరూ దాటవేశారు. దీంతో విచారణ వేగవంతం చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. వాళ్లు మళ్లీ ఏ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతో పాటు క్రిమినల్ కేసులు బుక్ చేయడానికి అధికారులు సమయాత్తమవుతున్నారు.