సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): జీతాలు,రిలీవ్ లెటర్ ఇవ్వకపోవడంతో కళాశాల చైర్మన్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఐడీ స్పష్టించి.. దూషణలకు పాల్పడుతున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను బుధవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడు దక్షిణ కోయంబత్తుర్ శక్తినగర్‌కు చెందిన సిరాజుద్దీన్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పేరొందిన ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు.
జీతానికి సంబంధించిన అంశంలో కళాశాల నిర్వాహకులతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే అతడికి రిలీవ్ లెటర్‌ను ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యం ఇలా చేసిందని భావించి.. కళాశాల చైర్మన్ పేరు మీద ఫేస్బుక్ ఐడీ సృష్టించి.. కళాశాలతో పాటు చైర్మన్‌పై అభ్యంతకరమైన పోస్టులు పెట్టాడు. గుర్తించిన చైర్మన్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.