హైదరాబాద్ : నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యను భ్రష్టు పట్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్లు తయారీ చేస్తున్న 10 మంది సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మలక్‌పేట, ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో పలవురిని ముఠా సభ్యులు మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశంలోని వివిధ వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వివరాలను వెల్లడించారు. మలక్‌పేటలో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో శ్రీకాంత్ సంస్థను నిర్వహిస్తున్నాడు. డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడు. ఒక్కో డిగ్రీ సర్టిఫికెట్‌కు రూ. లక్ష వసూలు చేస్తున్నారని సీపీ తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులను కూడా అరెస్టు చేశామని పేర్కొన్నారు. భోపాల్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్సిటీ నుంచి నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించామన్నారు. ఆ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సాయంతో డిగ్రీ పట్టాలు జారీ అయ్యాయి. వర్సిటీకి చెందిన ఇతన ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. బీటెక్ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు లక్షల్లో డబ్బులు ఇచ్చారు. తీసుకున్న డబ్బుల్లో 30 శాతం శ్రీకాంత్, 70 శాతం నగదు కేతన్ సింగ్ తీసుకున్నట్లు తేలింది అని సీపీ స్పష్టం చేశారు.
అత్తాపూర్‌లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న మహేశ్వర్ కూడా కేతన్ సింగ్‌తో చేతులు కలిపాడు. మహేశ్వర్ ఇతర వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించాడు. ఈయన ఏజెంట్ల ద్వారా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటివి పలు సంస్థలు ఉన్నాయి. నకిలీ సర్టిఫికెట్ల నివారణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటోందన్నారు. నకిలీ సర్టిఫికెట్ల విచారణకు డీఐజీ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు.