Children’s Eye Care | సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఆరు నెలల వయస్సు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించిన ఈ సర్వేలో రెండు వైద్యబృందాలుగా ఏర్పడి 36 అంగన్వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4020 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 20 మందికి అద్దాలు అవసరమవుతున్నాయి.
వివిధ రకాల కంటి సమస్యలతో 53 మంది, కంటి తిప్పుకుపోవడం సమస్యతో 13 మంది, కంటి పైరెప్ప వాలిపోవడం సమస్యతో ఇద్దరు, విటమిన్ ఏ లోపంతో వచ్చే గాయాలతో 29 మంది, మైయోఫియాతో 6గురు, చూపు మసకబారి ముగ్గురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దాలు అవసరమైన చిన్నారులందరికీ ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వనున్నారు.
జిల్లాలో 28 మంది పీఎంఓ వైద్యులు అవసరం ఉండగా, కేవలం ఇద్దరు మాత్రమే ప్రస్తుతం కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని ఆరేళ్లలోపు చిన్నారులకు మూడు నెలల్లోనే కంటి పరీక్షలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది కొరతతో వైద్యాధికారులు ఆలోచనలో పడ్డారు. మరోవైపు మే నెలలో ఎండల తీవ్రత కారణంగా నెలరోజులపాటు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో చిన్నారులంతా సెంటర్లకు రాకుండా ఇంటి పట్టునే ఉండటంతో స్క్రీనింగ్ పరీక్షలకు బ్రెక్ పడింది. తిరిగి జూన్ నెలలో సెంటర్లు ప్రారంభించగానే టెస్టులు మొదలుపెట్టనున్నారు.