సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, ఉద్యోగుల గుర్తింపునకు వారి పనితీరే ప్రామాణికమని ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, ధూల్‌పేట ప్రాంతాల్లో మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ఈడీ కమలాసన్‌రెడ్డి నగదు పురస్కారాలను అందజేశారు.
తాను మరణిస్తూ..మరికొందరికి వెలుగు
ఖైరతాబాద్, ఫిబ్రవరి 22 : తాను మరణించినా పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో వ్యక్తి. జీవన్‌దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ హేమానగర్‌కు చెందిన ఓరుగంటి సుధాకర్ (54) ఓ ప్రైవేట్ దవాఖానలో ఆపరేషన్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల కిందట విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 21న బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు నిర్ధారించారు. జీవన్‌దాన్ కౌన్సిలింగ్‌తో కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సుధాకర్ శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించారు.