Indiramma House | యాచారం, మే30 : ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. దీనికి సంబంధించి సిఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (44) అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి సొంతిల్లు లేకపోవడంతో ఇందిరమ్మ లిస్టులో అతని పేరు సైతం వచ్చింది. కానీ చివరిలో తన పేరు లిస్టులో లేకపోవడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గ్రామంలో ఇల్లు మంజూరైన వారందరూ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసుకొంటున్నారు. కానీ అశోక్ పేరు లేకపోవడంతో అతను ఆవేదన చెందాడు. ఇంట్లో తెల్లవారుజామున ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నా చావుకు కారణం ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేసిన కాంగ్రెస్ నాయకులు అని తన చేతిపై రాసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.
సంఘటన స్థలాన్ని సిఐ నందీశ్వర్ రెడ్డి, ఎస్సై సత్యనారాయణ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. గత కొన్నేళ్లుగా సొంత ఇంటికోసం అతను ఎంత గానో ఇబ్బందులకు గురవుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇంటి స్థలం లేకున్నప్పటికీ ఇంటి స్థలం చూసుకునేలోపే మంజూరు చేసిన ఇంటిని రద్దు చేశారని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేసిన మోసంతోనే తన భర్త మృతి చెందినట్లు మృతుని భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతోనే తన భర్త ఉరేసుకొని చనిపోయాడని, తన ముగ్గురు ఆడబిడ్డలను ఎలా పోషించాలని బోరున విలపించింది. ఆమె అర్తనాదాలు అందరిని కంటతడి పెట్టించాయి. గతంలో గ్రామ వార్డు సభ్యునిగా పనిచేసినప్పటికీ అశోక్ సొంత ఇల్లు లేకపోవడం ఎంతో బాధాకరమని గ్రామస్తులు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన
చింతపట్ల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు అశోక్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, బీఆర్ఎస్, సీపీఎం తదితర పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు ఒక సారిగా మిన్నంటాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి అల్లంపల్లి నరసింహ, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యకుడు రమేశ్ గౌడ్ నాయకులు లిక్కి నర్సింహారెడ్డి, వెంకటయ్య, యాదయ్య గౌడ్, కాజు, గోపాల్ చేరుకొని గ్రామస్తుల ధర్నాకు మద్దతు తెలిపారు. పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇల్లు లేని నిరుపేదలకు పంపిణి చేసి, వెంటనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆయన అధికారులను కోరారు. గ్రామపంచాయతీ ముందు కొన్ని గంటల పాటు ధర్నా కొనసాగిస్తున్నా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు కొంచెమైనా స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.