Srinivas Goud | ఖైరతాబాద్, ఫిబ్రవరి 26 : గౌడల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, సమస్త ప్రజలకు దివ్య ఔషధాన్ని పంచుతున్న నీరా కేఫ్‌ను ధ్వంసం చేయడం నీచమైన చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఒక ఆయుర్వేద ఔషధంగా మూత్రపిండాల, నరాల బలహీనతలకు మందులా పనిచేసే నీరాను మళ్లీ పునరుజ్జీవింప చేసి దాని ఔనత్యాన్ని చాటేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్, ఐఐసీటీ లాంటి సంస్థలు, విదేశాలకు చెందిన కొన్ని పరిశోధన సంస్థలు కూడా నీరా క్యాన్సర్‌కు మంచి ఔషదంగా పనిచేస్తుందని తేల్చిచెప్పాయని పేర్కొన్నారు. పసి పిల్లల నుంచి పెద్దల వరకు ఓ దివ్య ఔషధంగా సేవించే నీరాను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రజేస్తోందని అన్నారు.
కల్లుగీసే సమయంలో అనేక మంది వృత్తిదారులు మృత్యువాత పడ్డారని, కానీ వృత్తిని మాత్రం మానకుండా మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం గౌడ కులాన్నే కాదు.. వెనుకబడిన అనేక కులాల సంక్షేమానికి పాటుపడ్డారని తెలిపారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లును నిషేధించిందని, నాడు జరిగిన ఉద్యమంలో అనేక మంది కల్లుగీత కార్మికులు మరణించారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికులకు తగిన ప్రాధాన్యతనిచ్చి, ఓ ఆరోగ్యకరమైన పానీయంగా నీరాను గుర్తించి భారతదేశంలోనే తొలిసారిగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. నాడు గీత పారిశ్రామిక సహకార సంఘం, బీసీ కార్పొరేషన్ నిధులతో నీరా కేఫ్‌ను నిర్మిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి గీత, ఈత చెట్ల నమునాలను, వాటిపై ఉన్న గీత కార్మికుడి బొమ్మలను తొలగించి సాగర్‌లో పడేసిందని విమర్శించారు. చివరకు కేఫ్‌లోని అద్దాలను తొలగించి, నీరా కేఫ్ బోర్డులను పగులగొట్టి వాటిపై లేక్ వ్యూ హాల్ అనే బోర్డును అతికించారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరా కేఫ్‌లను జిల్లాల్లో విస్తరించాల్సి ఉండగా, ఉన్న కేఫ్‌ను చిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది గౌడ కులస్తులు, వారి వృత్తిపై కాంగ్రెస్ ప్రభుత్వ దాడిగా పరిగణిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ దాష్టీకంపై కులాలకు, పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలని కోరారు. నీరా కేఫ్‌ను ధ్వంసం చేసి, గీత కార్మికుల గుండెలపై తన్నినందుకు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మార్చి 17న ఇందిరా పార్కు వద్ద వేలాది మందితో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాకు అన్ని కుల వృత్తుల నాయకులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. మహాధర్నాలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నీరా కేఫ్‌ను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన వారు ఎక్కడున్నా పట్టుకుంటామని, వారికి శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పారు.
సమావేశ సమయంలో విద్యుత్ కోత
ఇదిలా ఉండగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా విద్యుత్ కోత జరిగింది. దీంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గౌడ సంఘాల సమావేశం జరుగుతున్న సమయంలో విద్యుత్ కోతలేందని ప్రశ్నించారు. దీని వెనుక కుట్రదాగుతుందని ఆరోపించారు. ఎన్ని కుట్రలుజేసినా ప్రభుత్వాన్ని ఎండగట్టడం మానుకోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్న, గౌడ సంఘాల ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, గోపా అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న, గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎలికట్టి విజయ్ కుమార్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గౌడ్, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు సదానంద్ గౌడ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి శ్రీనివాస్, తెలంగాణ కల్లు గీతకార్మిక సంఘం నాయకులు వెంకటనర్సయ్య, గౌడ్స్ ఇంటర్నేషన్ క్లబ్ అధ్యక్షులు మధుసూదన్ గౌడ్, జై గౌడ్ సేన అధ్యక్షులు ఏడుకొండల్ గౌడ్, గౌడ విద్యార్ధి సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.