ఆర్.కె.పురం, మే 2. పేదింటి ఆడబిడ్డ పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా కేసీఆర్ విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సరూర్‌నగర్, ఆర్కే పురం డివిజన్లకు మంజూరైన 99 కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ చెక్కులను శుక్రవారం సరూర్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, తాము అధికారంలోకొస్తే రూ. 1,00,116 లతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ. 1,00,116 మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సరూర్‌నగర్ డివిజన్‌కు చెందిన 209 మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికీ తులం బంగారం బాకీ పడిందని చెప్పారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్తామామతో పాటు కోడలికి కూడా రూ.2500 ఇస్తామని చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం కుటుంబంలోని అత్తామామలతో పాటు కోడలికి రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బడ్జెట్ చూసుకోకుండా ఇష్టమొచ్చిన విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా రాష్ట్రం అప్పుల పాలయ్యిందని, లంక బిందెలు లేవని పదే పదే చెప్పడం సిగ్గుచేటు అన్నారు. లంక బిందెలు ఉంటేనే హామీలు ఇస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వంలోనైనా అప్పులు ఉంటాయని వాటిని చూసుకొని హామీలు ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారన్నారు. మాట ఇచ్చిన ప్రకారం హామీలు అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తుంటే కేసీఆర్‌కు, ఎమ్మెల్యేలకు ఏం పని లేదని, పదేపదే అడుగుతున్నారని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేయకున్నా ప్రజలు అర్థం చేసుకొని అడగడం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తామని పదేపదే చెపుతున్నారని, ఇప్పటివరకు ఎక్కడ కూడా మహిళలను కోటీశ్వరులు చేసిన దాఖలాలు కనపడడం లేదని అన్నారు. కోటి మంది మహిళలలో ఏ ఒక్క మహిళ కూడా కోటీశ్వరురాలు కాలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంతవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నే ఉంటామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రంలో సంపాదన సృష్టించి ప్రజలకు పంచితే, నేటి సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.