బడంగ్‌పేట, మే 19: హైదరాబాద్ శివారు మహేశ్వరం నియోజకవర్గంలోని సూరన్ గుట్ట ఎల్లమ్మ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్‌నగర్ నుంచి రావిర్యాల వరకు వెళ్లే మార్గంలో ఉన్న సూరన్ గుట్ట ఎల్లమ్మ ఆలయ రోడ్డు పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సూర్యగిరి ఎల్లమ్మను దర్శించుకోవడానికి ప్రతిరోజూ 10 నుంచి 15వేల మంది భక్తులు వస్తున్నారని.. రహదారి సరిగ్గా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రెండు కోట్ల రూపాయలతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశామని, రోడ్డు అభివృద్ధికి రూ.4కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. అయితే ఆ నిధులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ రోడ్డు అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు చేయాలని మున్సిపల్ అధికారులకు సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రోడ్డు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి, భక్తుల సౌకర్యాలను కల్పించే లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు.