Hyderabad | సిటీబ్యూరో: రోజుకో హత్య లేక ఎక్కడో ఒకచోట మహిళలకు వేధింపులు.. ఇవి చాలవన్నట్లు కిడ్నాప్‌లు.. అడపాదడపా దోపిడీలు, దొంగతనాలు.. ఈజీగా మారిన గన్‌ఫైరింగ్.. ఒకటేమిటి.. అన్ని నేరాలకు కేరాఫ్‌గా గ్రేట్ హైదరాబాద్ మారిపోయింది. 2023 నుంచి 2024కు క్రైమ్ రేట్ కొంతమేరకు పెరిగితే ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే సుమారుగా 166కిపైగా హత్యలు, దొంగతనాలు వంటి ప్రధాన నేరాలు జరుగుతుంటే చిన్నాచితకా నేరాల లెక్క వీటికి రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి.
ఇక మహిళలపై వేధింపుల ఘటనలు సుమారుగా 86 వరకు నమోదైనట్లు పోలీసులు చెప్పారు. అసలు కమిషనరేట్‌లో పోలీసింగ్ పట్టు తప్పుతోందా.. లేక నేరస్తుల్లో భయం తగ్గుతోందా.. అన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వల్ల స్టేషన్లలో పోలీసుల నుంచి బాధితులకు స్పందన రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన చాలా నేరాల్లో పాత నేరస్తులే మరోసారి నేరాలకు పాల్పడుతున్నారని, వారిపై సరైన నిఘా లేకపోవడం కూడా నేరాల పెరుగుదలకు కారణమని పోలీసులే చెప్పారు.
పోలీస్ గస్తీ కనిపించడంలేదు..!
పదేండ్ల పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల స్థాపనే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసింగ్‌పై దృష్టిపెట్టింది. మహిళల రక్షణ కోసం షీటీమ్స్ ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసు గస్తీ ముమ్మురంగా ఉండి నేరాల నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ సుస్థిరంగా ఉండేదని నగరవాసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు పోలీసుల గస్తీ కొన్నిచోట్ల కనిపించినా వారు పెద్దగా రోడ్డుపై ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితిలో లేరనే విమర్శలున్నాయి. తాజా పరిణామాలు చూస్తే పెరుగుతున్న క్రైమ్‌రేట్ ను బట్టి హైదరాబాద్ మరో బీహార్‌గా మారుతుందా అన్న అనుమానం తలెత్తుతోంది.
ఫీడ్‌బ్యాక్ సెంటర్లకు స్వస్తి..!
తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసింగ్‌కు ఆనాటి ప్రభు త్వం చాలా ప్రాధాన్యతనిచ్చింది. ప్రతీ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ సెంటర్లు ఫిర్యాదుదారుల నుంచి తీసుకునే ఫీడ్ బ్యాక్ కీలకమయ్యేది. గతంలో నేరాలు చేసిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు వారిపై నిఘా పెట్టే వ్యవస్థ కూడా సరిగా లేకపోవడం వల్ల ఇటీవల జరిగిన చాలా నేరాల్లో పాత నేరస్తులే మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
విజుబుల్ పోలీసింగ్‌తోనే నేరాలకు చెక్
విజిబుల్ పోలీసింగ్‌తోనే నేరాలు చాలా వరకు అరికట్ట వచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన జర్మనీ యువతిపై లైంగిక దాడి ఘటనతో శివారు ప్రాంతాల్లో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కాగా, విదేశీ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన యాకత్‌పురాకు చెందిన మహ్మద్ అబ్దుల్ అస్లాంపై గతంలోను కేసులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. జర్మనీ విద్యార్థినికి నగరాన్ని చూపిస్తానంటూ నమ్మించి కారులో ఎక్కించుకొని వెళ్లి పహాడీషరీఫ్ ప్రాంతంలో అఘాయిత్యానికి పాల్పడిన కామంధుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు.